
9 అంశాలతో పోలీస్ అధికారులకు డీజీపీ లేఖ
శివధర్‌రెడ్డి ఘాటు లేఖపై పోలీస్‌శాఖలో తీవ్ర చర్చ
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌స్టేషన్లు, పోలీస్ కార్యాలయాలను సివిల్ వివాదాలు తీర్చే పంచాయితీ కార్యాలయాలుగా మార్చొద్దని డీజీపీ బి.శివధర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘సివిల్ వివాదాలను పోలీస్‌స్టేషన్లు లేదా పోలీస్ కార్యాలయాల్లో పరిష్కారం చేయరాదు. ఈ విషయాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయనే విషయం తెలిసిందే. పోలీస్‌స్టేషన్లు లేదా పోలీస్ కార్యాలయాల్లో సివిల్ పంచాయితీలు నిర్వహించడంలో పాల్గొనే అధికారులపై కఠిన చర్యలు తప్పవు’అని డీజీపీ పేర్కొన్నారు. కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తమ అవినీతితో పోలీస్‌శాఖకు మచ్చ తేవొద్దని హెచ్చరించారు.
తాజాగా మొత్తం 9 అంశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ అధికారులు, అన్ని పోలీస్ యూనిట్ల ఆఫీసర్లు, డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, నాన్‌కేడర్ ఎస్పీలు, ఇతర స్టాఫ్ అధికారులకు డీజీపీ లేఖ రాసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందులో పోలీసింగ్ విధానాలు ఎలా ఉండాలన్న దానితోపాటు, అవినీతికి తావు లేదంటూ డీజీపీ అత్యంత స్పష్టంగా పేర్కొన్న అంశాలపై పోలీస్‌శాఖలో ఇప్పుడు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. డీజీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శివధర్‌రెడ్డి ఈ నెల 9న అన్ని యూనిట్ల పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన తన పంథాను స్పష్టం చేశారు.
మీ అవినీతితో పోలీస్‌శాఖకు మచ్చ తేవొద్దు
‘అవినీతి,అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టేది పోలీస్ సిబ్బంది. కానీ, అవినీతికి పాల్పడే కొందరు పోలీస్‌శాఖకు అప్రతిష్ట తీసుకొస్తున్నారు. అవినీతికి పాల్పడి పోలీస్‌శాఖకు మచ్చ తీసుకురావొద్దు. అవినీతికి పాల్పడే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పోలీస్ యూనిఫాం అంటే గౌరవం, బాధ్యత, ప్రజలకు లేదా దేశ సేవకు ప్రతీక. అవినీతి అనేది నమ్మక ద్రోహానికి సంకేతంగా చెప్పొచ్చు. యూనిఫాం, అవినీతి రెండు విరుద్ధమైనవి. అంటే యూనిఫాం ధరించిన వ్యక్తి అవినీతికి పాల్పడితే, యూనిఫాం అసలు అర్థాన్ని చెరిపివేస్తుంది.
ప్రజలు పోలీస్‌శాఖపై ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మన ప్రవర్తన..యూనిఫామ్‌కు గౌరవం, ప్రభుత్వానికి ప్రతిష్ట, సమాజంలో శాంతిని కల్పించే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’అని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు. పేదవారి, బలహీనవర్గాల సమస్యలు విని న్యాయం చేయాలి..తద్వారా పోలీసుశాఖ పట్ల విశ్వాసం, అధికారులపై అభిమానం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ఆపదలో ఆదుకునే వారిని పేద ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు అని తన అభిప్రాయంగా డీజీపీ ఈ లేఖలో పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆలోచింపజేసేలా తన భావాలను వ్యక్తీకరిస్తూ డీజీపీ రాసిన లేఖ గురించి పోలీస్ అధికారులు, సిబ్బందిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.