
గత వారం విధించిన దుబాయ్ న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళకు దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గంజాయి అక్రమ రవాణా చేస్తూ అక్కడి విమానాశ్రయంలో చిక్కడంతో ఈ మేరకు తీర్పు ఇచి్చంది. బహదూర్‌పురలోని ఆమె కుటుంబీకులు బ్యాంకాక్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్‌పై ఆరోపణలు చేస్తున్నారు. మహిళకు న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బహదూర్‌పురకు చెందిన ఓ మహిళ బ్యూటీషియన్ కోర్సు చేశారు. ఈమెకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. తండ్రి పక్షవాతంతో మంచం పట్టగా...తల్లి గృహిణి కావడంతో కుటుంబ పోషణ భారం మహిళ పైనే పడింది.
దీంతో కుమారుడిని తల్లిదండ్రుల వద్ద వదిలి దుబాయ్ వెళ్లి బ్యూటీషియన్ ఉద్యోగం చేయాలని భావించింది. దీనికోసం ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేయించుకుంది. అతగాడు ఈ మహిళను బ్యాంకాక్ మీదుగా దుబాయ్ పంపాడు. బ్యాంకాక్‌లో సదరు ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తి ఈ మహిళకు ఓ ప్యాకెట్ ఇచ్చాడు. దాన్ని దుబాయ్‌లో తమ మనిషి వచ్చి తీసుకుంటారని చెప్పారు. ఈ ప్యాకెట్‌తో మహిళ ఈ ఏడాది మే 18న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది. అక్కడ తనిఖీలు చేపట్టిన అధికారులు మహిళ తీసుకువచి్చన ప్యాకెట్‌లో గంజాయి ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు ఈ నెల 6న నేరం నిరూపణ అయినట్లు ప్రకటించింది. మçహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి సదరు మహిళ వీడియో కాల్ ద్వారా నగరంలోని తల్లితో మాట్లాడింది. తీవ్రంగా రోదిస్తూ తాను కేవలం పది నిమిషాలే మాట్లాడగలనని, ఒక్కసారి తన కుమారుడిని చూపించాలంటూ తల్లిని కోరింది. న్యాయసహాయం చేస్తే నిరోషిగా బయటపడతాననే నమ్మకం ఉందని చెప్పింది. దీంతో మహిళ తల్లి పాతబస్తీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులకు విషయం తెలిపింది. వీరి ద్వారా విషయం తెలుసుకున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో దుబాయ్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ జనరల్ (సీజీఐ) స్పందించారు. యువతికి అవసరమైన న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చి బహదూర్‌పురలోని ఆమె కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.