
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 6వ డీజీపీగా శివధర్‌రెడ్డి(Telangana New DGP Shivadhar Reddy) బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారికంగా బాధ్యతలు చేపట్టారాయన. ఈ సందర్భంగా తనను నియమించిన సీఎం రేంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు..
‘‘స్థానిక సంస్థల ఎన్నికలను(Local Body Elections) సజావుగా నిర్వహించడమే మా లక్ష్యం. మాకు బలమైన టీమ్ ఉంది. ఈ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. ఎన్నికల భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజల రక్షణే ధ్యేయంగా పని చేస్తాం. టెక్నాలజీని మరింత సమర్థవంతగా వినియోగించుకుంటాం.
మావోయిస్ట్ విధానాలు సక్సెస్ కాలేదు. ఆ విధానాలు ఆచరణలో విఫలం అయ్యాయి. పోరాట మార్గం వీడతామని గతంలో వాళ్లు లేఖలు రాశారు. అడవుల నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవండి. మావోయిస్టులను స్వచ్చందంగా లొంగిపోవాలని సూచిస్తున్నా.
.. శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంటుంది. అలాగేని ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం కఠిన చర్యలే ఉంటాయి. సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా పోస్టులు పెడితే ఊరుకోం. మాకు రెడ్ బుక్, పింక్ బుక్ ఉండదు.. మాదీ ఖాకీ బుక్(Khaki Book) అని స్పష్టం చేశారాయన. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సహకరించాలని తెలంగాణ పౌరులను కోరారాయన. తెలంగాణ పోలీస్ శాఖలో 17 వేల ఖాళీలు ఉన్నాయన్న నూతన డీజీపీ.. వాటి నియామకంపై ఫోకస్ పెడతామని తెలిపారు.
ఇదీ చదవండి: కాళేశ్వరం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం