గోడు చెప్పుకోలేక..వినేవారులేక! | IIIT Allahabad BTech student Ends Life | Sakshi
Sakshi News home page

గోడు చెప్పుకోలేక..వినేవారులేక!

Apr 1 2025 1:05 PM | Updated on Apr 1 2025 1:05 PM

IIIT Allahabad BTech student Ends Life

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతున్న రాష్ట్రానికి చెందిన ఓ మూగ, బధిర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్‌ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఎం. రాహుల్‌ చైతన్య (18) అనే యువకుడు తనువు చాలించాడు. పుట్టినరోజున తల్లికి మెసేజ్‌ పంపి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

 మృతుడి స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామం. ఇదే కళాశాలకు చెందిన కాట్రవత్‌ అఖిల్‌ (20) అనే మరో తెలంగాణ విద్యార్థి కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆదివారం రాత్రే మరణించడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను సమీపంలోని ఎస్‌ఆర్‌ఎన్‌ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ధూమన్‌గంజ్‌ ఏసీపీ అజేంద్ర యాదవ్‌ తెలిపారు. 

తమ కళాశాలలోని మూగ, బధిర విభాగంలో రాహుల్‌ చైతన్య బీటెక్‌ ఫస్టియర్‌లో చేరాడని అలహాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ పీఆర్వో పంకజ్‌ మిశ్రా చెప్పారు. గత మూడు నెలలుగా అతను తరగతులకు హాజరుకావడం లేదని.. చదువుల సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. ఈ ఒత్తిడి గురించి అతను తల్లికి కూడా తెలియజేశాడని వివరించారు. ఇద్దరు విద్యార్థుల మరణంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు యాజమాన్యం త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement