ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఉన్నందున రాజకీయ నాయకుల పాత్రపై ఇప్పుడే చెప్పలేం
తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2025 విడుదల సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకుల పాత్ర ఉందా..? లేదా..? అన్నది ఇప్పుడే చెప్పలేమని, అది కేసు దర్యాప్తులో భాగంగా తెలుస్తుందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి తెలిపారు. కేసులో ఎవరి పాత్ర ఉన్నా.. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి స్పందించడం సరికాదన్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, అనిల్ కుమార్, చారు సిన్హా, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు డా.ఎం.రమేశ్, చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2025ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం అన్ని రకాల నేరాల్లో 2 శాతం తగ్గుదల నమోదైనట్టు వెల్లడించారు. 3 విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు, గ్లోబల్ సమ్మిట్, మెస్సీ ఈవెంట్, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో సహా అన్నింటినీ విజయవంతంగా నిర్వహించామన్నారు.
మావోయిస్టుల సమస్య పరిష్కారానికి కృషి
కేంద్ర ప్రభుత్వ డెడ్‌లైన్ ప్రకారం మార్చి 31 వరకు మావోయిస్టుల సమస్య పరిష్కారానికి తెలంగాణ పోలీసులు సైతం కృషి చేస్తున్నట్టు తెలిపారు. శాంతి మార్గాన్ని అనుసరిస్తున్నందున తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాట్లు పెరిగాయన్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరతపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అవసరాలకు తగిన విధంగా సిబ్బంది నియామకాలపై ప్రభుత్వ అనుమతి కోరుతున్నట్టు తెలిపారు. నయాం కేసు దర్యాప్తులో భాగంగా స్వాదీనం చేసుకున్న భూములు విక్రయించకుండా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు.
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, అందులో వాస్తవాలు త్వరలోనే బయటికి వస్తాయన్నారు. పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలకు కారణమవుతున్న పరిస్థితులను తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం కొనసాగుతుందని తెలిపారు. మహిళా, చిన్నారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేలా ‘ఒక్క నిమిషం మీ జీవితాన్ని మార్చుతుంది’అన్న థీమ్‌తో త్వరలోనే మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిమిషం నిడివితో షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించనున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.


