
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదని, పౌరులు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే పోలీసుల అత్యాగాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. మంగళవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. దేశం కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు అమరులయ్యారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీస్ అమరవీరులకు నాలుగు కోట్ల ప్రజల పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తున్నా.
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలోనే ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. అమరవీరుల కుటుంబాలకి ఇచ్చే ఎక్స్ గ్రేషియాను భారీగా పెంచి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం.
.. రోజు రోజుకు నేరాల స్వభావం మారుతోంది. కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. శాంతి భద్రతల కట్టడికి పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. అందుకే అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా పని చేస్తోంది. డ్రగ్స్ రహిత తెలంగాణే మా ధ్యేయం.
దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉంది. సాంకేతికతలో తెలంగాణ పోలీసులు ముందు ఉన్నారు. సైబర్ క్రైమ్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులు మంచి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాం. ఇటీవల కొందరు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలంటే శాంతిభద్రతలు బాగుండాలి. తెలంగాణ అభివృద్ధిలో వారి వంతు తోడ్పాటు అందించాలి.
అలాగే.. పోలీసుల గౌరవం పెరిగితేనే ప్రభుత్వ గౌరవం కూడా పెరుగుతుంది. సోషల్ మీడియా ప్రభావం బాగా ఉన్న ఈ రోజుల్లో.. పోలీసుల ప్రతీ అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి అని సీఎం రేవంత్ సూచించారు.

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రసంగిస్తూ.. పోలీస్ అధికారులు అవినీతికి, నిర్లక్ష్యానికి తావు లేకుండా నిధులు నిర్వహించాలి. దేశంలోనే తెలంగాణ పోలీసులు అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను ఒకరోజు గుర్తు చేసుకుంటే సరిపోదు. వాళ్ళ కుటుంబాన్ని పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పై ఉంది. ఉగ్రవాదులు, తీవ్రవాదుల చేతిలో చనిపోయిన కుటుంబాలకు అధిక ఎక్స్గ్రేషియా కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని అన్నారు.