సాక్షి, హైదరాబాద్: కీలక నేతల లొంగుబాటు.. అగ్రనేతల ఎన్‌కౌంటర్లతో కకావికలం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట ఇవాళ(నవంబర్ 22, శనివారం) భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. వీళ్లలో ముఖ్యనేతలతో పాటు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది దాకా ఉన్నట్లు సమాచారం.
ఆపరేషన్ కగార్‌తో మావోయిజం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని.. అభివృద్ధిలో భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌తో పాటు కీలక సభ్యులు రమేష్, అప్పాసి నారాయణ, ఎర్రాలు లొంగిపోతారని తెలుస్తోంది. వీళ్లిద్దరితో పాటు 20 మంది దాకా డివిజన్ ఏరియా కమిటీ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. అజాద్ 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఏడాదిలో.. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా వరుస ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందారు. పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోయారు.
ఇక.. అనారోగ్య కారణాలతో చంద్రన్న, బండి ప్రకాశ్ ఆయుధాలు వీడారు. మరో నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నాం డీజీపీ శివధర్‌రెడ్డి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.


