తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా ఎల్లప్పుడూ కలిసుండాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొంత మంది నాయకులు సొంత ప్రయోజనాల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి రెండు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారని, ఇది ఎంతమాత్రం సరైంది కాదని అన్నారు.
''అందరం అన్నదమ్ములం. మనమంతా ఒకటే భాష మాట్లాడుతున్నాం. ఎవరికి ఎవరూ వ్యతిరేకం కాదు. తెలంగాణ ప్రాంతంలోని వారికి నష్టం చేయాలని జగన్ ఏ రోజూ ఆలోచన చేయడు, తపన పడడు, తాపత్రయపడడు. అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్లకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం. కొత్త రిజర్వాయర్లు ఏమీ కట్టడం లేదు. ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనులమవుతాం. ఇదే మేం చేస్తున్నాం. ఇందులో ఒక ఎమోషనల్ డ్రామా ప్లే చేసి.. భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమం పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తావున్నారు. తప్పది. వాస్తవాలు కరెక్ట్‌గా చెప్పాలి. కరెక్ట్‌గా చెప్పినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. అందరం అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉన్నామ''ని వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు.
రాయలసీమకు 'చంద్ర'గ్రహణం
కాగా, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసి ఆ ప్రాంత ప్రజలకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెన్నుపోటు పొడిచారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజా ప్రయోనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు దగ్గరుండీ మరి ఖూనీ చేశారని, ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరూ ఉండరని మండిపడ్డారు. తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారని, రాయలసీమకు 'చంద్ర'గ్రహణం పట్టిందని జగన్ దుయ్యబట్టారు.
చదవండి: ఆ 20 టీఎంసీల నీళ్లు ఉంటే..
'క్రెడిట్ వితవుట్ కాంట్రిబ్యూషన్'
భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ (Credir Chori) చేయడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పట్టించుకోలేదని, తమ హయాంలో పనులు వేగవంతం చేశామని గుర్తు చేశారు. కోవిడ్ కష్టాల్లో కూడా ఎయిర్‌పోర్టు పనులు ఆగలేదన్నారు. 2026లో భోగాపురం ఎయిర్‌పోర్టులో మొదటి విమానం టేకాఫ్ అవుతుందని 2023లోనే తాను చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు మనస్తత్వాన్ని 'క్రెడిట్ వితవుట్ కాంట్రిబ్యూషన్'గా వర్ణించారు.



