అడిషనల్‌ డీజీపీ శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌

President Police Medal For Additional DGP Shivadhar Reddy - Sakshi

12 మందికి ప్రతిభావంతమైన సేవా పతకాలు

సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురి పోలీసు అధికారులకు రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు. విశిష్ట సేవా పతకాల విభాగంలో తెలంగాణ నుంచి అడిషనల్‌ డీజీపీ (పర్సనల్‌) బి.శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ లభించింది. శనివారం ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 4 విభాగాల్లో మెడల్స్‌ దక్కగా.. రాష్ట్రపతి పోలీస్‌ శౌర్య పతకం, పోలీస్‌ శౌర్య పతకం విభాగాల్లో మెడల్స్‌ దక్కలేదు. కాగా, ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి, విజయవాడ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) కొట్ర సుధాకర్‌లకు రాష్ట్రపతి పతకం దక్కింది.

సేవా పతకాలు..  
తెలంగాణ నుంచి 12 మంది అధికారులకు ప్రతిభావంతమైన సేవా పతకాలు దక్కాయి. అకున్‌ సబర్వాల్‌ (ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌), టీఎస్‌ఎస్పీ రెండో బెటాలియన్‌ (ఐఆర్‌ యాప్లగూడ, ఆదిలాబాద్‌) కమాండెంట్‌ ఆర్‌.వేణుగోపాల్, హైదరా బాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఇక్బాల్‌ సిద్దిఖీ, బీచుపల్లి పదో బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ పి.సత్యనారాయణ, నిజామా బాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ డి.ప్రతాప్, ఖమ్మం టౌన్‌ ఏసీపీ ఘంటా వెంకటరావు, నల్లగొండ డీఎస్పీ సామ జయరాం, 8వ బెటాలియన్‌ (కొండాపూర్‌) ఆర్‌ఐ రవీంద్రనాథ్, హన్మకొండ ఏఎస్సై సుధాకర్, హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీ ఏఎస్సై ఎం.నాగలక్ష్మి, గండిపేట్‌ ఏఎస్సై ఆర్‌.అంతిరెడ్డి, పుప్పాలగూడ పోస్ట్‌ సీనియర్‌ కమాండో డి.రమేశ్‌బాబులకు సేవ పతకాలు లభించాయి.

ఎన్‌పీఏ నుంచి..: నేషనల్‌ పోలీస్‌ అకాడమీ హైదరాబాద్‌ ఎస్‌ఐ (బ్యాండ్‌) బి.గోపాల్‌కు విశిష్ట సేవా పతకాల విభాగంలో మెడల్‌ లభించింది  
ఎన్‌ఐఏ నుంచి: ప్రతిభావంతమైన సేవా పతకాల (పోలీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) విభాగంలో హైదరాబాద్‌ ఎన్‌ఐఏ అసిస్టెంట్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి, హైదరాబాద్‌ ఎన్‌ఐఏలో డీఎస్పీగా పనిచేస్తున్న దొంపాక శ్రీనివాసరావుకు పతకం లభించింది.  
భారతీయ రైల్వే నుంచి: హైదరాబాద్‌లో రైల్వేలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న తూంకుంట చంద్రశేఖర్‌రెడ్డి, కర్నాటి చక్రవర్తి, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దోమాల బాలసుబ్రమణ్యానికి ప్రతిభావంతమైన సేవా పతకం లభించింది.

ఫైర్‌ సర్వీస్‌ మెడల్స్‌..  
దేశవ్యాప్తంగా 104 మంది అగ్నిమాపక సర్వీసు అధికారులకు పతకాలు ప్రకటించగా తెలంగాణ నుంచి స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రాజ్‌ కుమార్‌ జనగామ, ఫైర్‌మన్‌ భాస్కర్‌రావు కమతాలకు ఫైర్‌ సర్వీస్‌ మెడల్స్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకం లభించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top