
రేసులో శివధర్ రెడ్డి, సీవీ ఆనంద్
తదుపరి డీజీపీ ఎవరన్న అంశంపై చర్చ
శిఖాగోయల్ కూడా పోటీలో.. శివధర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు!
ఆనంద్‌కు విజిలెన్స్ డీజీ ఇచ్చే అవకాశం
నెలాఖరున డీజీ జితేందర్ రిటైర్‌మెంట్
ఇంటెలిజెన్స్ డీజీగా సజ్జనార్?
దసరాకు ముందే భారీగా బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఎవరన్నదానిపై పోలీస్ శాఖలో చర్చ జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ డా.జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్–హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) పోస్టుకు ప్రధాన పోటీ సీనియర్ ఐపీఎస్‌లు సీవీ ఆనంద్, బి శివధర్‌రెడ్డి మధ్యే నెలకొంది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే కావడంతో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్‌రెడ్డివైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. శివధర్‌రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా.. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమిస్తే.. సీవీ ఆనంద్‌ను విజిలెన్స్ డీజీగా పంపడంతోపాటు, ఏసీబీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనూ సీవీ ఆనంద్ ఏసీబీ, విజిలెన్స్ డీజీగా పనిచేశారు.
ఇలా చేయడం వల్ల సీనియారిటీ పరమైన పొరపచ్చాలు తలెత్తకుండా డీజీపీగా శివధర్‌రెడ్డి, పోలీస్ శాఖతో నేరుగా సంబంధం లేకుండా ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఏసీబీ, విజిలెన్స్‌కు డీజీగా ఆనంద్ కొనసాగే వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ (డీజీ) ర్యాంకులో 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ రవిగుప్తా, డా.సౌమ్యామిశ్రా (1994 బ్యాచ్ ఐపీఎస్), శిఖాగోయల్ (1994 బ్యాచ్ ఐపీఎస్), ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్ ఐపీఎస్) కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న పదవీ విరమణ పొందనున్నారు. ఆప్టే వినాయక్ ప్రభాకర్ కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. మిగిలిన వారిలో శిఖాగోయల్ శిఖాగోయల్ సైతం డీజీపీ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ సీపీకి తీవ్ర పోటీ
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం సీపీ సీవీ ఆనంద్ బదిలీ అయితే, ఆ స్థానంలోకి ఎవరు వస్తారన్నది ఆసక్తిరంగా మారింది. ఈ పోస్టుకు ప్రధానంగా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్, 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం శాంతిభద్రతల అడిషనల్ డీజీగా ఉన్న మహేశ్ భగవత్ ప్రధానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. 1996 బ్యాచ్ ఐపీఎస్, సీఐడీ చీఫ్ చారుసిన్హా, 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు డీఎస్ చౌహాన్, వై నాగిరెడ్డి అడిషనల్ డీజీ హోదాలో ఉన్నారు.
వీరితోపాటు వీవీ శ్రీనివాస్, స్వాతిలక్రా, సంజయ్‌కుమార్ జైన్, స్టీఫెన్‌రవీంద్ర సైతం హైదరాబాద్ సీపీ పోస్టుకు అర్హులుగా ఉన్నారు. అయితే, వీరిలో సజ్జనార్ పేరు హైదరాబాద్ సీపీతోపాటు ఇంటెలిజిన్స్ డీజీ పోస్టుకు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ డీజీగా 1996 బ్యాచ్ ఐపీఎస్ అనిల్‌కుమార్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
హైదరాబాద్ తర్వాత అత్యంత కీలక కమిషనరేట్ అయిన సైబరాబాద్ సీపీ సైతం బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ పోస్టుకు ఎస్‌ఐబీ చీఫ్ సుమతితోపాటు ఏసీబీలో పనిచేస్తున్న తరుణ్‌జోషి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా పలు కీలక విభాగాలతోపాటు జిల్లా ఎస్పీల వరకు త్వరలో పెద్ద సంఖ్యలో అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. దసరా పండుగలోపే ఈ బదిలీలు జరిగే అవకాశం ఉందని సమాచారం.