సాక్షి హైదరాబాద్: రేవంత్ సర్కార్ హానీమూన్ ముగిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన వాళ్లు ఆదారాలతో సహాదొరికారని అయినప్పటికీ వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్‌కు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో తనకు తెలియదు గానీ తాను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుతానని కేటీఆర్ అన్నారు. ఆయన ఇంట్లోని మహిళలు, పిల్లలు, మనమడి గురించి మాట్లాడి తన మాదిరి చిల్లర రాజకీయాలు చేయనని తెలిపారు. కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్‌లోనే ఉన్నామంటున్నారని అది పెద్ద కామెడీలా అనిపిస్తుందన్నారు.
కొంతమంది తనను ఐరన్ లెగ్ అంటున్నారని తాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకే 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీ స్థానాలు గెలిచామన్నారు. రేవంత్ సీఎం అయ్యాక కనీసం సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేక పోయాడని కేటీఆర్ విమర్శించారు. కనుక తాను ఐరన్ లెగ్ కాదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఐరన్ లెగ్ అని కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ప్రజల్లోకి రానున్నారని ఆయన బహిరంగ సభలలో పాల్గొనే అంశం రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


