లొంగిపోయిన మావోయిస్టు పుల్లూరి ప్రసాద్‌రావుకు రూ.25 లక్షల డీడీ అందిస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి. చిత్రంలో మరో మావోయిస్టు బండి ప్రకాశ్, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతి
మావోయిస్టులు ఇష్టంతోనే బయటకు వస్తున్నారు: డీజీపీ శివధర్‌రెడ్డి
డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్/పెద్దపల్లి/జూలపల్లి: పోలీసుల ఎదుట లొంగిపోతున్న మావోయిస్టులను కాపాడుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి హామీ ఇచ్చారు. లొంగిపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అని పేర్కొన్నారు. మావోయిస్టులు ఎవరికి వారు ఇష్టంతోనే బయటకు వస్తున్నారని.. అలాంటి వారి మీద మావోయిస్టులు యాక్షన్ తీసుకుంటామనడం కరెక్ట్ కాదని చెప్పారు. సిద్ధాంతపరంగా వారు ఎంత పడిపోయారో దీనిని బట్టి తెలుస్తున్నదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ చెప్పారు. 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్‌సీఎం) బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ మేరకు వారిద్దరూ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు.
ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి డీజీపీ ఆ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల పేరిట ప్రకటించిన రివార్డు మొత్తం నుంచి చంద్రన్నకు రూ.25 లక్షలు, బండి ప్రకాశ్‌కు రూ.20 లక్షల చొప్పున డీడీలను అందించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టు కీలక నేతలు, నాలుగు దశాబ్దాలకు పైగా అండర్‌గ్రౌండ్‌లో పనిచేసిన ఇద్దరూ జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. ఈ ఏడాదిలో 427 మంది మావోయిస్టు అండర్ గ్రౌండ్ కేడర్లు సాయుధ పోరాటాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చాయన్నారు.
మావోయిస్టు భావజాలాన్ని ఓడించడం ఎవరితరం కాదు : చంద్రన్న
మావోయిస్టు భావజాలాన్ని ఓడించడం ఎవరితరం కాదని చంద్రన్న తేల్చి చెప్పారు. డీజీపీ ఎదుట లొంగిపోయిన అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. లాల్‌సలాం అంటూ తాను మాట్లాడారు. ‘ఇది లొంగుబాటు కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మేం జనంలోకి వచ్చి పనిచేయాలనుకుంటున్నాం. పార్టీలో అంతర్గతంగా చీలిక వచ్చింది ఇది క్లియర్. అవకాశం వచ్చిప్పుడు నేను పిలుస్తా మీరు (మీడియాను ఉద్దేశించి) రండి. నేను మాట్లాడుతా. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్‌జీ అలియాస్ తిప్పరి తిరుపతిని పార్టీ ఎన్నుకుంది. పార్టీలో చీలిక వచ్చింది కా>బట్టి ఎవరి మార్గం వారు ఎంచుకున్నారు. మా మార్గం మేము ఎంచుకున్నాం. నేను మాత్రం పార్టీ లైన్‌నే సమర్థిస్తున్న. దేవ్‌జీకి సపోర్ట్ చేస్తున్న. సోనును వ్యతిరేకిస్తున్న. మాకు కూడా ప్రజల మధ్య పనిచేసే కేడర్ ఉన్నారు’అని చెప్పారు.
చంద్రన్న నేపథ్యం
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్‌రావు పదోతరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నాడు. 1979లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ (బైపీసీ) చదువుతుండగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్‌గా వ్యవహరించిన దగ్గు రాజలింగుతో చంద్రన్నకు పరిచయం ఏర్పడింది. ఆయన ప్రభావంతో ఆర్‌ఎస్‌యూలో చేరి 1980లో మల్లోజుల కిషన్‌జీకి కొరియర్‌గా పనిచేస్తూ హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న కేఎస్ గ్రూప్‌కు సమాచారం చేరవేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
1980 జూలైలో ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ దళంలో సభ్యుడిగా పనిచేశారు. 1981లో పీపుల్స్‌వార్ ఆవిర్భావం తర్వాత సిర్పూర్ దళ కమాండర్‌గా 1983లో బాధ్యతలు చేపట్టారు. 1995 నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్‌జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2007లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో కేంద్రకమిటీ సభ్యుడు అయ్యారు.
2021లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. 2024 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యతలు బడే దామోదర్ అలియాస్ చొక్కారావుకు అప్పగించిన తర్వాత సీసీ మెంబర్‌గా, తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరించారు. డివిజినల్ కమిటీ సభ్యురాలు మోతీబాయి అలియాస్ రాధక్కను 1989లో వివాహం చేసుకున్నారు. ఆమె 2013 జూన్‌లో భద్రాద్రి కొత్తగూడెంలో అరెస్టు అయ్యింది. 2015లో జైలు నుంచి విడుదలై ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని తన స్వగ్రామంలో నివసిస్తోంది.
ప్రభాత్‌పేరిట పత్రికా ప్రకటనలు ఇచ్చేది బండి ప్రకాశే..:
బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. 1983లో కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఏడో తరగతి వరకు చదివాడు. రాడికల్ యూత్ లీగ్ (ఆర్‌వైఎల్)లో 1984లో చేరాడు. తర్వాత పుల్లూరి ప్రసాదరావు నాయకత్వంలో సిర్పూర్ సాయుధ దళంలో కొనసాగాడు. 1984లో సీపీఐ నాయకుడు వీటీ అబ్రహం హత్యలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1988లో ఆదిలాబాద్ సబ్ జైలు నుంచి పారిపోయి 1989లో అండర్ గ్రౌండ్‌కు వెళ్లాడు.
కొన్నాళ్లకు సిద్ధాంతపరమైన విభేదాలు రావడంతో దళాన్ని వదిలి హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో సుతారి మేస్త్రీగా పనిచేశాడు. అబ్రహం హత్యకేసులో 1992లో మరోసారి అరెస్టు కాగా. జీవితఖైదు పడి చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు. 2004లో మెర్సీ గ్రౌండ్స్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. శాంతిచర్చల సమయంలో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ నుంచి ప్రాతనిధ్యం వహించాడు. 2005లో శాంతి చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు.
2008 నుంచి 2011 వరకు చర్ల–శబరి ఏరియా కమిటీ ఇన్‌చార్జ్‌గా, 2012లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది, ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2015లో ఆరోగ్యం క్షీణించడంతో సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ ఇన్‌చార్జ్‌గా, ప్రజావిముక్తి పత్రిక సంపాదకుడిగా నియమించారు. 2015 నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్‌సీ) ప్రెస్‌టీం ఇన్‌చార్జ్ కొనసాగుతూ సీపీఐ మావోయిస్టు పార్టీ పత్రికా ప్రకటనలు ‘ప్రభాత్’పేరుతో విడుదల చేస్తున్నాడు.


