సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దీంతో, పెన్ డ్రైవ్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
వివరాల మేరకు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ చుట్టూనే ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణ కొనసాగుతోంది. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్‌లో ఫోన్ టాపింగ్‌కు సంబంధించిన.. కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నంబర్లు నమోదై ఉన్నట్లు తేలింది. వీటిలో రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో, మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్టు తెలిసింది.
ప్రస్తుతం ఈ పెన్ డ్రైవ్‌లోని డేటాను ప్రభాకర్ రావు ముందుంచి ఉంచి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక, ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నెంబర్లను గుర్తించడంలో ఈ డిజిటల్ ఆధారమే కీలకంగా మారిందని సిట్ భావిస్తోంది. ప్రభాకర్ రావు బృందం చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసినప్పటికీ, ఈ ప్రెన్ డ్రైవ్ దొరకడం కేసులో కీలక ఆధారంగా మారింది. ఈ కేసును నిరూపించేందుకు పెన్ ప్రధాన ఆధారంగా ఉందని అధికారులు చెబుతున్నారు.


