సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న వేళ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు దానం కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా.. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం. ఎంఐఎంతో కలుపుకుని కాంగ్రెస్ 300 డివిజన్లలో గెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరుగుతాను. కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరిస్తాను. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే, స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకు స్పీకర్‌కు వివరణ ఇవ్వని దానం. కాగా, దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇలా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో దానం వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


