సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. అయితే, ఈ ప్రమాదానికి ఓవర్ లోడే కారణమని పోలీసులు నిర్ధారించారు. కాగా, ప్రమాద సమయంలో లచ్చు నాయక్ టిప్పర్‌లోనే ఉన్నారని పోలీసులు చెప్పడం కొసమెరపు.
వివరాల ప్రకారం.. చేవెళ్లలో నవంబర్ మూడో తేదీన ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు, టిప్పర్ డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది. ఈ ప్రమాదానికి ఓవర్ లోడ్ ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అలాగే, ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్ యజమాని లచ్చు నాయక్ టిప్పర్‌లోనే ఉన్నట్టు తెలిపారు.
ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా.. లచ్చు నాయక్ మాత్రం గాయాలతో బయటపడ్డారు. అయితే, లచ్చు నాయక్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో లచ్చు నాయక్ పేరును తాజాగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్టు చెప్పుకొచ్చారు.


