ఎన్నికల నిధులు పక్కదారి..!
మొయినాబాద్: మున్సిపాలిటీలో అక్రమాల బాగోతం బయటపడింది. ఎన్నికల న్విహణకోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అర్హులకు కాకుండా తమకు అనుకూలమైనవారికి పనులు కట్టబెట్టడంపై ఓ అధికారి, ఉన్నతాధికారిని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం షోకాజ్ నోటీస్‌లు ఇచ్చేంత వరకు వెళ్లింది. ఎన్నికల విధుల్లో భాగంగా ఓటరు జాబితా తయారీ, అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, స్ట్రాంగ్ రూంల ఏర్పాటు, టెంట్లు, ఫొటోగ్రాఫీ, వీడియోగ్రాఫీ వంటి పనులకు కేటాయించిన నిధులు గోల్‌మాల్ అవుతున్నట్లు సమాచారం. ఈ విధులను మున్సిపల్ అధికారులు అర్హులైనవారికి కాకుండా తమకు అనుకూలమైన వారికి కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. పనిచేసిన కూలీలకు సైతం సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా ఓ ఉన్నతాధికారి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారి ఇష్టారాజ్యం..?
మున్సిపాలిటీలో ఓ డీఈ స్థాయి అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ అండతో అంతా తానై కిందిస్థాయి సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్ల ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న అవగాహనతోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మున్సిపల్ కింది స్థాయి అధికారులు, సిబ్బంది గుసగుసలాడుకుంటున్నా విషయాన్ని బయటకు పొక్కకుండా అధికారులు వారిపై ఆంక్షలు పెడుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల నిధులు పక్కదారి పడుతున్న విషయాన్ని గమనించిన సీనియర్ అసిస్టెంట్ ప్రశ్నించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ బాగోతం బయట పడుతుందని భావించిన ఉన్నతాధికారులు అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో కలత చెందిన అధికారి మూడు రోజులుగా ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్‌ను వివరణ కోరగా ఎన్నికల నిర్వహణకు కేటాయించిన నిధుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. దీనిపై జిల్లా కలెక్టర్‌కు పూర్తి నివేదిక ఇచ్చామన్నారు.
మొయినాబాద్ మున్సిపాలిటీలో
అక్రమాలు
ఎన్నికల ఖర్చుల పేరుతో
నిధులు మళ్లించినట్లు ఆరోపణలు
సీనియర్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీస్


