ముక్క.. సుక్క!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మున్సిపల్ చైర్మన్ పీఠాలను ఆశిస్తున్న ఆశావహులు తమ వార్డుల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రకరకాల హామీలు ఇవ్వడంతో పాటు ప్రతి రోజూ మద్యం, మాంసం సరఫరా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుండటం, నేడు ఆదివారం కావడంతో అభ్యర్థులు ఓటర్లకు ఇంటికి కిలో మటన్/ చికెన్ సహా ఓటర్ల సంఖ్యను బట్టి బాస్మతి రైస్, అర బాటిల్ మద్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. భారీగా మద్యం, మాంసం పంపిణీ జరుగుతున్నా.. ఎన్నికల నిఘా వర్గాలు అటువైపు కన్నెత్తి చూడటమేలేదన్న విమర్శలు ఉన్నాయి.
ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.20 లక్షకుపైనే..
అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.లక్ష దాటకూడదనే నిబంధన ఉంది. కానీ ఇప్పటికే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.20 లక్షలు దాటినట్లు సమాచారం. కాలనీ, అపార్ట్‌మెంట్ సంక్షేమ, కుల, కార్మిక సంఘాలు, వివిధ వర్గాల ఓటర్లతో గెట్ టు గెదర్ పార్టీలు ఏర్పాటు చేసి కావాల్సినవన్నీ సమకూర్చుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పంపకాలకు తెర తీయడంతో ఖర్చులు రెట్టింపవుతున్నాయి. మరోవైపు ఓటర్లు ‘మా ఓటు మీకే’ అంటూ వచ్చిన ప్రతి అభ్యర్థికీ హామీలివ్వడం గమనార్హం.
సండే స్పెషల్ ఎన్నికల దావత్
కిలో చికెన్.. బాస్మతి రైస్..
అర బాటిల్ మద్యం
పోటాపోటీగా పంకాలకు సిద్ధం
ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు
ముక్క.. సుక్క!
ముక్క.. సుక్క!


