డెడ్‌లైన్ తర్వాత పుంజుకోవచ్చనుకుంటే పొరపాటే..
మావోయిస్టులపై దాడుల విషయంలో స్పష్టతనిచ్చిన డీజీపీ శివధర్‌రెడ్డి
డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు
తెలంగాణకు చెందిన 54 మంది మావోయిస్టుల్లో పనిచేస్తున్నట్టు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత భద్రతా బలగాల ఆపరేషన్లు తగ్గుముఖం పడతాయని మావోయిస్టు పార్టీ నాయకత్వం కేడర్‌ను తప్పుదారి పట్టిస్తోందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి చెప్పారు. అయితే మార్చి తర్వాత కూడా మావోయిస్టులపై భద్రత బలగాల ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంగా పనిచేస్తున్న మిగిలిన వారు సైతం ఎదుట లొంగిపోవాలని ప్రభుత్వం, పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
మావోయిస్టు పార్టీ కొమురంభీం ఆసిఫాబాద్–మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు చెందిన కనికారపు ప్రభంజన్ (మంచిర్యాల జిల్లా) సహా మొత్తం 41 మంది మావోయిస్టులు శుక్రవారం డీజీపీ ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ... లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డు మొత్తం రూ.1,46,30,000 వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచిన తర్వాత డీడీ రూపంలో అందిస్తామన్నారు.
ప్రస్తుతం తక్షణ సాయం కింద రూ.25వేలు ఇస్తామని, పునరావాసం కింద ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని వెల్లడించారు. మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతి, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు.
నాయకత్వంపై నమ్మకం లేకనే..
భద్రతా బలగాల నుంచి రక్షణ పొందేందుకు మావోయిస్టు నాయకత్వం కేడర్‌ను వారి ఇష్టాలతో సంబంధం లేకుండా కొత్త ప్రాంతాలకు పంపడంతో వారు నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేక ఇబ్బందిపడుతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆచరించే విధానాలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య పెరుగుతున్న అంతరం కారణంగా నాయకత్వంపై నమ్మకం పోతోందని, సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు కూడా లొంగుబాట్లకు కారణమని చెప్పారు.
భద్రత బలగాల నుంచి నిరంతర ఒత్తిడి, క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితి కూడా కారణాలుగా చెప్పారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 54 మంది ఇంకా వివిధ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉండగా వీరిలో ఐదుగురు తెలంగాణ ప్రాంతానికి చెందినవారన్నారు.
స్టేట్ కమిటీలో 8 మంది, డివిజనల్ కమిటీ సభ్యులు 13 మంది, ఏరియా కమిటీ సభ్యులు 16 మంది, 12 మంది సభ్యులు ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీలో మొత్తం 36 మందిలో ఆరుగురు తెలంగాణ వారుండగా, 30 మంది ఇతర రాష్ట్రాల సభ్యులు ఉన్నట్టు తెలిపారు. వారంతా చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి తిరుగుతున్నట్టు తెలిపారు.
అప్పగించిన ఆయుధాలివీ..
ఒక ఇన్‌సాన్ ఎల్‌ఎంజీ, మూడు ఏకే–47 రైఫిళ్లు, 5 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 7 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక బీజీఎల్ గన్, నాలుగు 303 రైఫిళ్లు, ఒక సింగిల్‌షాట్ రైఫిల్, రెండు ఎయిర్ గన్స్‌తోపాటు 42 మ్యాగజైన్లు, 733 బుల్లెట్లు, 8 షెల్స్ పోలీసులకు అప్పగించారు.
సాజిద్ ఆరుసార్లు హైదరాబాద్‌కు..
ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ 1998లో ఉద్యోగం కోసం హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలి యాకు వెళ్లాడని, అక్కడే యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. దేశాన్ని విడిచి వెళ్లిన 27 ఏళ్లలో అతడు ఆరుసార్లు భారత్‌కు వచ్చి వెళ్లినట్టు ఆధారాలున్నాయని తెలిపారు.
2000 అక్టోబర్‌లో భార్యతో కలిసి తొలిసారి వచ్చాడని, రెండోసారి 2004లో, మూడోసారి ఫిబ్రవరి 2009లో అతడి తండ్రి మృతిచెందిన నెల రోజులకు, నాల్గోసారి జూలై 2012లో ఆస్తుల తగాదాల పరిష్కారం కోసం, ఐదోసారి మార్చి 2016లో కుటుంబ సభ్యులతో ఆస్తుల సెటిల్‌మెంట్ కోసం, చివరగా 2022 జూలైలో తన తల్లిని, సోదరిని చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిపారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ఉగ్రచర్యలకు పాల్పడలేదని చెప్పారు.


