- పొగతాగేవారిలోనే ఎక్కువగా సీఓపీడీ
- ఊపిరితిత్తుల్లో నయం చేయలేని వ్యాధి
- డీజీపీ శివధర్ రెడ్డి సూచన
- ఎప్పుడో పొగతాగినా, 60 ఏళ్ల తర్వాతే సీఓపీడీ
- కామినేని ఆస్పత్రిలో నిర్ధారణకు ప్రత్యేక ప్యాకేజి
హైదరాబాద్, ‘‘క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అనేది ఎక్కువకాలం పాటు పొగ తాగడం, లేదా పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే తీవ్ర సమస్య. దీన్ని పూర్తిగా నయం చేయడం దాదాపు సాధ్యం కాదు. మధుమేహం, రక్తపోటు లాంటివి మన చేతుల్లో లేని, మనం నియంత్రించలేని వ్యాధులు. అదే సీఓపీడీ అయితే మనం సిగరెట్లు కాల్చకుండా ఉంటే చాలు.. మన దరి చేరదు. కాలుష్యం బారిన పడకుండా, పొగ తాగకుండా ఉంటే చాలావరకు పెద్దవయసులో ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. దురలవాట్లకు దూరంగా ఉంటే ఇలాంటి సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి. అందువల్ల ఊపిరి ఆగిపోకుండా ఉండాలంటే సిగరెట్లు కాల్చడం ఆపాల్సిందే’’ అని రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు తెలిపారు. అంతర్జాతీయ సీఓపీడీ డే సందర్భంగా నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
‘సీఓపీడీని వీలైనంత ముందుగా గుర్తిస్తే అప్పటివరకు ఊపిరితిత్తులకు అయిన నష్టాన్ని కొంతవరకైనా తగ్గించే అవకాశం ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్ల తర్వాతే ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అప్పుడు ఊపిరి అందడం కొంత తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడో 20లలో చేసిన తప్పులకు 60లలో పడే శిక్ష ఇది. దీన్ని గుర్తించడానికి ఉన్న ఏకైక పరీక్ష.. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (పీఎఫ్టీ). సాధారణంగా దీనికి రూ.3వేల వరకు ఖర్చవుతుంది. అయితే, సీఓపీడీ డే సందర్భంగా కామినేని హాస్పిటల్స్ వారు ఈ నెల 22వ తేదీ వరకు రూ.400కే ఈ పరీక్షను, పల్మనాలజిస్టు కన్సల్టెన్సీని అందిస్తున్నారు. పొగతాగే అలవాటు ఉన్నవారు, ఇప్పటికే ఇబ్బంది పడుతున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకొండి.”

సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘రోజుకు 10 సిగరెట్ల చొప్పున 20 ఏళ్లు కాల్చినా, లేదా 20 సిగరెట్ల చొప్పున పదేళ్లు కాల్చినా సీఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా 60 ఏళ్లు దాటిన తర్వాతే బయటపడే సమస్య. ఎప్పుడో సిగరెట్లు కాల్చి తర్వాత మానేశాం అనుకున్నా కూడా అప్పటికే ఈ నష్టం జరిగి ఉండొచ్చు. దాని లక్షణాలు మాత్రం 60 ఏళ్ల తర్వాత క్రమంగా మన రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు బయటపడతాయి. సిగరెట్లు కాల్చడమే కాక.. పొయ్యి పొగ ఎక్కువగా పీలుస్తున్నా, తీవ్రమైన వాయుకాలుష్యానికి గురైనా కూడా ఈ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగని సిగరెట్లు కాల్చేవారందరికీ ఇది వస్తుందని చెప్పలేం. కేవలం 20% మందిలో మాత్రమే ఇది కనపడుతోంది. ఈ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా న్యుమోనియా టీకా, ఇన్ఫ్లూయెంజా టీకాలు వేయించుకోవడం మంచిది. సీఓపీడీ వల్ల ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు బాగా సన్నబడిపోతాయి. అందువల్ల ఊపిరి అందడం కష్టమవుతుంది. ఆస్థమా ఉన్నవారికైతే దాన్ని పూర్తిగా నయం చేయగలం. కానీ సీఓపీడీని మాత్రం పూర్తిగా నయం చేయడం అసాధ్యం. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష ద్వారానే దీన్ని గుర్తించగలం. అందువల్ల పొగతాగే అలవాటు ఉన్నా, పొగ వచ్చే పొయ్యిలను ఎక్కువ కాలం ఉపయోగించినా, తరచుగా వాయుకాలుష్యానికి గురవుతున్నా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఊపిరితిత్తులు మరింత పాడవ్వకముందే వాటిని కాపాడుకోవాలి’’ అని చెప్పారు.


