
గత కొన్నేళ్ల పాటు హాజరవని కొత్వాల్స్
సీనియారిటీ సహా అనేక కారణాలు నేపథ్యంలోనే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్ డీజీపీ...రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీసు కమినరేట్‌కు బాస్ నగర కొత్వాల్. వీరిద్దరి మధ్యా సరైన సమన్వయం లేకపోతే..! గతంలో పని చేసిన డీజీపీలు, నగర పోలీసు కమిషనర్ల విషయంలో అదే జరిగింది. ఫలితంగా ప్రతి రోజూ ఉదయం డీజీపీ నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్‌కు నగర కొత్వాల్‌గా పని చేసిన అధికారులు దూరంగా ఉంటూ వచ్చారు. డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి, కొత్వాల్‌గా విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పరిస్థితి మారింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి డీజీపీ నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్‌కు నగర పోలీసు కమిషనర్ కచి్చతంగా హాజరవుతున్నారు.
ప్రతి రోజూ ఉదయం డీజీపీ నిర్వహించే ఈ కాన్ఫరెన్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం తీసుకున్న తాజా విధానపరమైన నిర్ణయాలను డీజీపీ వెల్లడిస్తుంటారు. దీనికి తోడు ముందు జరిగిన కీలక ఘట్టాలు, లోటుపాట్లు, ఆ రోజు జరుగనున్న కార్యక్రమాలపై సమగ్రంగా చర్చ జరుగుతుంది. ఆయా సందర్భాల్లో పోలీసు విభాగం అనుసరించాల్సిన వ్యూహాల పైనా దిశానిర్దేశం ఉంటుంది. ఇంతటి కీలకమైన డీజీపీ టెలీ కాన్ఫరెన్స్‌కు దాదాపు మూడున్నరేళ్లుగా పని చేసిన హైదరాబాద్ పోలీసు కమిషనర్లు దూరంగా ఉన్నారు.
అసలు పాల్గొనకపోడం, అడపాదడపా పాల్గొనడంతో పాటు తమకు బదులుగా వేరొక ఆఫీసర్ హాజరయ్యేలా చేయడం వంటివి జరిగాయి. కొత్వాల్ కంటే జూనియర్లు డీజీపీలుగా ఉండటం, డీజీపీకి కొత్వాల్‌కు మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో పాటు అనేక వ్యక్తిగత కారణాల వల్లా ఇలా జరిగింది. దీని ప్రభావం పోలీసింగ్‌పై పడటంతో పాటు అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నారు. శివధర్‌రెడ్డి, సజ్జనర్ ఈ విధానానికి స్వస్తి చెప్పారు. సంప్రదాయ పద్దతుల్ని మళ్లీ అమలులోకి తీసుకువస్తూ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్‌లో నగర పోలీసు కమిషనర్ కచి్చతంగా పాల్గొంటున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేని పక్షంలో డీజీపీ అనుమతి తీసుకుంటున్నారు. ఇలా నగర, రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న ఇతర అధికారులకు బాస్ ఈజ్ బాస్ అనే స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు.