బీటెక్ విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు
కట్నం, బంగారం కోసం తల్లిదండ్రులతో కలిసి వేధింపులు
హైదరాబాద్: ఆమె బీటెక్ చదువుతోంది.. ప్రేమించానని ఓ యువకుడు నమ్మబలకడంతో ప్రేమపెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతోపాటు అతని కుటుంబసభ్యులు కట్నం, బంగారం తీసుకురావాలని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఎల్‌బీనగర్ పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం... మాన్సూరాబాద్ వాంబే కాలనీలో నివాసం ఉండే కుంచం సైదులు, దుర్గమ్మ భార్యభర్తలు. వీరికి ఓ కుమారుడు, కూతురు గంగోత్రి(21) ఉంది. గంగోత్రి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది.
అదే కళాశాలలో చదువుతున్న అబ్దుల్లాపూర్‌మెట్ చిన్న రావిరాల గ్రామానికి చెందిన నందినితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నందిని అన్న భానును కొన్నిరోజుల క్రితం గంగోత్రికి ఆమె పరిచయం చేసింది. వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా భాను కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో రెండు నెలల క్రితం కీసరలో వారు వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం భాను గంగోత్రిని చిన్నరావిరాలలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే కట్నం, బంగారం తీసుకురాలేదని భాను కుటుంబసభ్యులు ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. రూ. 30 లక్షల కట్నం, 10 తులాల బంగారం పెట్టాలని గంగోత్రి కుటుంబసభ్యులను డిమాండ్ చేశారు.
కట్నం ఇచ్చే స్థోమత లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె కొన్ని రోజుల క్రితం మాన్సురాబాద్‌లోని తల్లిదండ్రుల వద్ద వచ్చింది. సోమవారం ఉదయం భాను బంధువులను తీసుకుని ఆమె వద్ద వచ్చాడు. కట్నం విషయంలో మరోసారి గొడవ పడ్డారు. మనస్తాపానికి గురైన గంగోత్రి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తన చావుకు భాను కారణమని, అతడిని వదిలిపెట్టొద్దని, జీవితం నాశనం చేశాడని సూసైడ్ నోట్‌లో రాసింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


