పెట్రోల్ బాటిళ్లతో హంగామా
మంటలు అంటుకోవడంతో హిజ్రాలకు గాయాలు
నిరసనను అడ్డుకునేందుకు వచ్చిన బోరబండ ఇన్‌స్పెక్టర్‌కు స్వల్ప గాయాలు
హైదరాబాద్: కేసులు పెడుతూ తమను వేధిస్తున్న హిజ్రా నాయకురాలిపై చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాలు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలు.. మోనాలిసా అనే ట్రాన్స్‌జెండర్ కూకట్‌పల్లి ఇందిరానగర్‌లో నివాసం ఉంటోంది. ప్రజల నుంచి దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేస్తున్న కొంతమంది హిజ్రాలపై పలు పోలీస్ స్టేషన్లలో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ప్రశ్నించేందుకు పద్మ అనే హిజ్రా మోనాలిసా వద్దకు వెళ్లింది.

ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో పద్మపై మోనాలిసా చేయి చేసుకుంది. దీంతో కక్ష పెంచుకున్న పద్మ తన తోటి ట్రాన్స్‌జెండర్లతో కలిసి సోమవారం మధ్యాహ్నం బోరబండ బస్టాప్ వద్దకు చేరుకుంది. మోనాలిసాపై చర్యలు తీసుకోవాలంటూ బైఠాయించి పెద్దఎత్తున వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను నవ్య అనే హిజ్రా తెరిచింది. గుర్తుతెలియని వ్యక్తి లైటర్ వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎనిమిది మంది వరకు హిజ్రాలకు గాయాలు కాగా నిరసనను అడ్డుకునేందుకు పోలీసు వచ్చిన బోరబండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేందర్‌కు సైతం స్వల్ప గాయాలయ్యాయి.

గాయపడ్డ హిజ్రాలను మోతీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం ఐఎస్ సదన్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బోరబండ ఏసీపీ, మధురానగర్ ఎస్‌హెచ్‌ఓలు ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు, స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు బోరబండ ఎస్‌హెచ్‌ఓ సురేందర్ తెలిపారు. పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకుండా ఆందోళన నిర్వహించిన వారి పట్ల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


