వృద్ధుల మధ్య సజ్జనార్ కొత్త సంవత్సర వేడుకలు
సికింద్రాబాద్ (రాంగోపాల్‌పేట): ఎటు చూసినా పండుటాకులే.. ఒక్కొక్కరిని కలుస్తూ ఆయన అలా ముందుకుపోతున్నారు.. మిఠాయిలు, పండ్లు అందిస్తున్నారు.. బాగున్నారా.. అంటూ పలకరిస్తున్నారు.. ఒక వృద్ధురాలి దగ్గరికి వచ్చేసరికి ఆమెను ఎక్కడో చూసినట్టుగా అనిపించి ఒక్క క్షణం ఆగారు. గుర్తుపట్టి ‘బాగున్నారా.. శ్యామల గారూ!’ అంటూ నమస్కరించారు. ఇదీ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమం, హెల్త్ కేర్ సెంటర్‌లో గురువారం కనిపించిన సన్నివేశం.
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) న్యూ ఇయర్ వేడుకలకు ఆత్మీయంగా జరుపుకున్నారు. ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమం, హెల్త్ కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నవారిని సజ్జనర్ పరామర్శించడంతోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిరాడంబరంగా న్యూ ఇయర్ డే వేడుకలు నిర్వహించారు. ఆశ్రయం పొందుతున్న 48 మందికి స్థానిక అధికారులతో కలిసి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న పావలా శ్యామలను (Pavala Shyamala) నెలరోజుల క్రితం తిరుమలగిరి ఏసీపీ రమేశ్ చొరవ తీసుకుని ఆర్కే ఫౌండేషన్ హెల్త్‌కేర్ సెంటర్‌లో చేర్పించారు. విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్.. మానవతా దృక్పథంతో స్పందించిన ఏసీపీ రమేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మిగిలినవారూ రమేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఆర్కే ఫౌండేషన్ ద్వారా 18 ఏళ్లుగా దాదాపు 15 వేల మంది వృద్ధులకు ఆశ్రయంతోపాటు వైద్యం అందిస్తున్న డాక్టర్ రామకృష్ణ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని ఈతరానికి సూచించారు. కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీ అశోక్, తిరుమలగిరి ఏసీపీ రమేశ్, కార్ఖానా ఇన్‌స్పెక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.


