
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకు పోలీసు శాఖ నిబద్ధతో ఉందని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌ను డీజీపీ శివధర్‌రెడ్డి దృవీకరించారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి ఆర్ధిక సాయం, ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. 300గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తాం. ప్రమోద్ ఉద్యోగ విమరణ పొందే వరకు వచ్చే శాలరీని వారి కుటుంబానికి అందిస్తాం.దీంతో పాటు ప్రమోద్ కుటుంబానికి పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16లక్షలు,పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8లక్షల పరిహారం ఇస్తాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి. కానిస్టేబుల్ ప్రమోద్‌కు పోలీస్ శాఖ తరుఫున నివాళులు’ అని తెలిపారు.
రియాజ్ ఎన్ కౌంటర్
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్(24) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు.
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు.

రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్‌పైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు.