సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున నిన్న(శనివారం అక్టోబర్ 25) తుపాకీ కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ జరిగిన ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, ఆయన గన్‌మెన్ వీఎస్‌ఎన్ మూర్తిలను డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో వారిని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
డీసీపీ, గన్‌మెన్ ధైర్య సాహసాలు కనబరిచారు : డీజీపీ శివధర్ రెడ్డి
నిన్న చాదర్‌ఘాట్‌లో పోలీసులపై మొబైల్ స్నాచర్లు దాడులు జరిపారు. సెల్ ఫోన్ స్నాచింగ్‌కి పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారు. డీసీపీ చైతన్య కుమార్, గన్‌మెన్ మూర్తి 750 మీటర్లు నిందితులను చేజ్ చేశారు. అందులో భాగంగా నిందితులు కత్తితో దాడి చేశారు. నిందితుడు ఒమర్ అన్సారీ పై 22 కేసులు ఉన్నాయి. కలపథర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీషీట్ ఉంది. ఈ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు కనబరిచిన డీసీపీ, గన్‌మెన్ ఆర్యోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. డీసీపీ, కానిస్టేబుల్ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాం. నిందితుడు ఒమర్ అన్సారీకి ఆపరేషన్ జరిగింది. నిందితుడి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.

రౌడీ షీటర్‌లు, దొంగలపై ఉక్కుపాదం: సీపీ సజ్జనార్
ఈ ఘటనలో ఇవోల్వ్ అయినా ఆటో డ్రైవర్, ఇంకో వ్యక్తిని పట్టుకోవడానికి డీసీపీ సౌత్ జోన్ నేతృత్వంలో టీమ్స్ పని చేస్తున్నాయి. కొన్ని క్లూస్ కూడా లభించాయి. ఇటీవల ఒమర్ కదలికలు, అతనికి ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నాము. విజబుల్ పోలీసింగ్ కూడా పెంచాం. నగర ప్రజలు ఎవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్‌లు, దొంగల పట్ల ఉక్కుపాదం మోపుతాం. మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్స్‌పై కూడా నిఘా పటిష్టం చేశాం డీసీపీకి మెడ భాగంలో గాయమైంది. గన్ మెన్ మూర్తికి కాలు గాయం అయ్యింది. డ్రైవర్ సందీప్ అలర్ట్‌గా ఉండి కీలక పాత్ర పోషించారు. డీసీపీ చైతన్య, మూర్తి, డ్రైవర్ సందీప్ ముగ్గురు ధైర్యసాహసాలు చూపారు. ఐదు బృందాలు నిందితుల కోసం గలిస్తున్నాయి.

అసలేం జరిగిందంటే..
కరడుగట్టిన దొంగ అన్సారీ సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతుండగా డీసీపీ చైతన్య గమనించి తన గన్‌మ్యాన్‌తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మ రక్షణ కోసం చైతన్యకుమార్ తన గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు.

డీసీపీ, గన్‌మ్యాన్‌లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్ అధికారి ఛేజింగ్ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.


