సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘ఆపరేషన్ కవచ్’ నేపథ్యంలో మొత్తం 1600 వాహనాలు స్వా«దీనం చేసుకున్నట్లు కొత్వాల్ వీసీ సజ్జనర్ శనివారం ప్రకటించారు. రాత్రి 10.30 గంటల నుంచి 150 ప్రాంతాల్లో ఐదు వేల మంది పోలీసులు ఈ భారీ నాకాబందీ నిర్వహించిన విషయం విదితమే. అనేక ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన సజ్జనర్ ఆపై బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ నుంచి పర్యవేక్షించారు. నగర వ్యాప్తంగా జరుగుతున్న ఆపరేషన్‌ను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన ఆయన పలువురు అధికారులతో పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న సంయుక్త సీసీ తఫ్సీర్ ఇక్బాల్‌తోనూ సంప్రదింపులు జరిపారు.
పోలీసులు మొత్తం 15 వేల వాహనాలను తనిఖీ చేయగా వాటిలో సరైన పత్రాలు లేని 1600 సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా తుకారంగేట్ ప్రాంతంలో అర కిలో గంజాయి దొరికింది. మొత్తమ్మీద 105 పెట్టి కేసులు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ ఒక్క రోజుతో ఆగిపోదని భవిష్యత్తులోనూ ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సజ్జనర్ పేర్కొన్నారు. అంకితభావంతో విధులు నిర్వహించిన ఐదు వేల మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.


