సాక్షి, హైదరాబాద్: రక్తదానం చేయడం అంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే అని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రోగుల అవసరానికి తగ్గట్టుగా జనాభాలో ఒక శాతం రక్తాన్ని దానం చేయడంలో ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఒక్క యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుందన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మెగా బ్లడ్ డొనేట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. అనంతరం, డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ..‘రక్తదానం చేయడం వల్ల పలు రకాలుగా రక్తం ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. ప్రతీ యేటా నాలుగు సార్లు బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో రోడ్డు ప్రమాదాలలో గాయపడే వారికి ఈ రక్తం అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఒక ఏడాదిలో ఎనిమిది వేల మంది చనిపోయారు. వారిలో రక్తం లేక చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. రోగుల అవసరానికి తగ్గట్టుగా జనాభాలో ఒక శాతం రక్తాన్ని దానం చెయ్యడంలో ప్రజలందరూ ముందుండాలి. రక్తదానం చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించిన సీపీ సజ్జనార్‌కు అభినందనలు తెలిపారు. గతంలో కోవిడ్ సమయంలో సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ప్రజలకు అందించిన సేవలను డీజీపీ కొనియాడారు.
మరోవైపు.. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగరంలో అన్ని జోన్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. తొమ్మిది క్యాంపుల ద్వారా 3,500 యూనిట్స్ టార్గెట్ పెట్టుకొని శిబిరాలు ఏర్పాటు చేశాం. పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు, ఎమర్జెన్సీలో ఆపరేషన్‌లో రక్తం అవసరం ఉంటుందన్నారు. తలసేమియా వ్యాధితో చాలామంది బాధ పడుతున్నారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన బ్లడ్ యూనిట్స్‌ను వాళ్లకు అందజేస్తామని తెలిపారు.
On the occasion of #PoliceCommemorationWeek, a Mega Blood Donation Drive is being organised across Hyderabad.
Let’s honour the sacrifices of our brave Police Martyrs by donating blood and saving lives. 🩸
Join us — every drop counts!#BloodDonation #HyderabadCityPolice… pic.twitter.com/1B8yG6RVc0— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 27, 2025


