మీ–సేవ యాప్‌లో ఆర్టీసీ సేవలు | RTC services on Mee Seva app | Sakshi
Sakshi News home page

మీ–సేవ యాప్‌లో ఆర్టీసీ సేవలు

Feb 25 2026 3:29 AM | Updated on Feb 25 2026 3:29 AM

RTC services on Mee Seva app

మీ–టికెట్‌ యాప్‌ను చేర్చిన ప్రభుత్వం 

బస్‌ టికెట్లు, టీ24 టికెట్,సిటీ బస్‌పాస్‌లు ఆన్‌లైన్‌ ద్వారా పొందే వీలు 

యాప్‌ను ఆవిష్కరించిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్న మీ–సేవా పోర్టల్, యాప్‌లలో ఇక నుంచి ఆర్టీసీకి సంబంధించి సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు అందులో ఆర్టీసీ సేవలతో కూడిన ‘మీ–టికెట్‌’యాప్‌ను చేర్చారు. రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మీ–సేవ కమిషనర్‌ రవికిరణ్, ఇతర ఆర్టీసీ అధికారులతో కలిసి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంగళవారం దీన్ని ప్రారంభించారు. ఇక దూరప్రాంత బస్సు టికెట్లతోపాటు హైదరాబాద్‌లో ఒకరోజు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగేందుకు వాడే టీ24 టికెట్లు, సిటీ పరిధికి సంబంధించిన ఐదు రకాల బస్‌పాస్‌లు ఈ యాప్‌ ద్వారా పొందే వెసులుబాటు ఉంటుంది. 

ప్రయాణికుల సౌలభ్యం కోసం మీ–సేవ మీ–టికెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సేవల్ని టీజీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచి్చంది. మీ–సేవ పోర్టల్‌లోకి వెళ్లి గానీ లేదా ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొనిగానీ ఈ సేవలు పొందొచ్చు. నేరుగా గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. దీంతో టికెట్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు నిరీక్షించాల్సిన అవసరం తప్పనుంది. 

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement