సాక్షి, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 198 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను, 114 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (TGPRB) తీసుకుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ నెల (డిసెంబరు) 30వ తేదీ నుంచి 2026 జనవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించే ముందు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో అర్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు సూచించారు.
TGSRTC లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి TSLPRB డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు https://t.co/Fzbd6YOnij లో 30 డిసెంబర్ నుండి 20 జనవరి 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. pic.twitter.com/WdFeMasC5j
— Telangana Police (@TelanganaCOPs) December 25, 2025
జీతభత్యాల విషయానికి వస్తే, ఎంపికైన ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీలకు నెలకు రూ. 27,080 నుంచి రూ. 81,400 వరకు పే స్కేల్ వర్తిస్తుంది. దరఖాస్తు రుసుముగా ఎస్‌సీ, ఎస్టీ, తెలంగాణ స్థానిక అభ్యర్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన కేటగిరీల అభ్యర్థులందరికీ రూ. 800 ఫీజుగా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


