
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక భారం మోయలేని తరుణంలో.. జంట నగరాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకుంది. పెరిగిన ఈ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
సిటీ బస్సుల్లో సోమవారం(అక్టోబర్ 6వ తేదీ నుంచి) పెంచిన ఛార్జీలను.. అదనపు చార్జీల రూపంలో వసూలు చేయనున్నారు. మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంపు, నాలుగో స్టేజ్ నుంచి రూ.10 పెంపు వర్తించనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పెంచిన ఛార్జీలు వసూలు చేస్తారు. అలాగే.. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధించేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 డిపోలు ఉన్నాయి. అందులో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. ఈ ఏడాదిలో అందుబాటులోకి రానున్న మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని మోయలేం.. అందుకే చార్జీలు పెంచాల్సి వస్తోందని టీజీఎస్‌ఆర్టీసీ అంటోంది.