
సాక్షి, హైదరాబాద్: దసరాకి పెంచిన చార్జీలతో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)కి భారీగా ఆదాయం సమకూరింది. రూ.110 కోట్లు ఆదాయం ఆర్జించింది. 50 శాతం అదనపు ఛార్జీలను ఆర్టీసీ వసూలు చేసింది.
కాగా, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 5,300 స్పెషల్ బస్సులు నడిపింది. వీటిలో కొన్ని సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడిపింది. తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేసింది.
ఈ ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్‌తోపాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి నడిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడిపింది. దసరా స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం టికెట్ ధరలను సవరించారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో స్పెషల్ బస్సుల్లోనూ సవరణ చార్జీలు అమలు చేస్తోంది.