చెన్నై: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) పురుషుల విభాగంలో నిరుటి రన్నరప్ హైదరాబాద్ తుఫాన్స్ ఆట ఈ సీజన్‌లో ఓటమితో మొదలైంది. టోరీ్నలో తమిళనాడు డ్రాగన్స్ శుభారంభం చేసింది. శనివారం హోరాహోరీగా జరిగిన తొలి మ్యాచ్‌లో డ్రాగన్స్ షూటౌట్‌లో 4–2తో హైదరాబాద్ తుఫాన్స్‌పై గెలుపొందింది. తమిళనాడు గోల్‌కీపర్ ప్రిన్స్ దీప్ సింగ్ షూటౌట్‌లో పాదరసంలా స్పందించాడు. దీంతో హైదరాబాద్ స్ట్రయికర్లు కొట్టిన రెండు గోల్స్‌ను సమర్థంగా అడ్డుకొని తమిళనాడును గెలిపించాడు. అతని ప్రదర్శన వల్లే డ్రాగన్స్ ఒక బోనస్ పాయింట్‌ను కూడా పొందింది. అంతకుముందు నిరీ్ణత సమయం ముగిసే సమయానికి 3–3తో స్కోరు సమమైంది.
హైదరాబాద్ స్ట్రయికర్ అమన్‌దీప్ లక్రా (12, 18వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో రాణించినా... చివరకు ఫలితం నిరాశపరిచింది. ఆట మొదలైన నాలుగు నిమిషాలకే తమిళనాడు బోణీ కొట్టింది. ఉత్తమ్ సింగ్ (4వ ని.) గోల్ కొట్టి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. తర్వాత మరో ఐదు నిమిషాలకే థామస్ సార్స్‌బై (9వ ని.) గోల్ చేయడంతో డ్రాగన్స్ ఆధిక్యం కాస్తా 2–0తో రెట్టింపైంది. అయితే కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే హైదరాబాద్ ఈ ఆధిక్యానికి గండి కొట్టింది. అమన్‌దీప్ (12వ ని.) గోల్ చేయడంతో తుఫాన్స్ 1–2తో తొలి క్వార్టర్‌ను ముగించింది. మళ్లీ రెండో క్వార్టర్ మొదలైన మూడు నిమిషాలకే అతనే గోల్ సాధించి స్కోరును 2–2తో సమం చేశాడు. తర్వాత మూడో క్వార్టర్‌లో తమిళనాడు తరఫున కార్తీ సెల్వం (32వ ని), హైదరాబాద్ జట్టులో ఆర్థర్ డి స్లూవెర్ (37వ ని.) చెరో గోల్ చేయడంతో ఈ క్వార్టర్‌లోనూ ఇరుజట్లు 3–3తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఆఖరి క్వార్టర్‌లో ఇటు తుఫాన్స్, అటు డ్రాగన్స్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో 4–2తో పైచేయి సాధించిన డ్రాగన్స్ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో సూర్మ హాకీ క్లబ్‌తో శ్రాచి బెంగాల్ టైగర్స్... రెండో మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌తో రాంచీ రాయల్స్ తలపడతాయి.
ఎస్‌జీ పైపర్స్ గెలుపు
రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో సూర్మ హాకీ క్లబ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన సూర్మ అమ్మాయిల జట్టు అన్నింటా ఓటమినే మూటగట్టుకుంది. శనివారం జరిగిన తాజా పోరులో సూర్మ హాకీ క్లబ్ 1–3తో ఎస్‌జీ పైపర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి క్వార్టర్‌లోనే సూర్మ క్లబ్ ప్లేయర్ పెన్ని స్క్విబ్ (12వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. సూర్మ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ మరుసటి నిమిషంలోనే పైపర్స్ లోరా రియెరా (13వ ని.) గోల్ స్కోరు 1–1తో సమం చేసింది. ఆ తర్వాత పైపర్స్ క్రీడాకారిణిలు జ్యోతి సింగ్ (18వ ని.), సునెలిత టొప్పొ (58వ ని.) చెరో ఫీల్డ్ గోల్ చేసి ఎస్‌జీ పైపర్స్‌ను గెలిపించారు. నేడు (ఆదివారం) జరిగే మ్యాచ్‌లో శ్రాచి బెంగాల్ టైగర్స్‌తో రాంచీ రాయల్స్ తలపడుతుంది.


