
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన ఆర్టీసీ.. ఇప్పుడు కండక్టర్లను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు తాజాగా మార్గదర్శకాలను ఖరారు చేసింది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుండి, పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది.
మానవ వనరుల సరఫరా సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కండక్టర్లుగా ఎంపికైన వారికి నెలవారీ చెల్లించే కన్సాలిడేటెట్ జీతం మొత్తం రూ.17,969గా నిర్ణయించారు. ఏజెన్సీ రూ.2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే.. దాన్ని ఈ మొత్తం నుంచి రికవరీ చేయనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వీరికి వర్క్‌మెన్స్ కాంపన్సేషన్ యాక్ట్ వర్తించదని తేల్చి చెప్పింది. పీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి చట్టబద్ధమైన వెసులుబాట్లు కూడా ఉండవని స్పష్టం చేసింది.