
బతుకమ్మ సందర్భంగా ఈ నెల 20 నుంచే ప్రారంభం
అక్టోబర్ 2 వరకు హైదరాబాద్ నుంచి స్పెషల్ సర్వీసులు
ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తాం: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు రవాణాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,754 స్పెషల్ బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిలో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న దసరా పండుగలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27 నుంచే చాలామంది సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉండటంతో ఆర్టీసీ ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్‌తోపాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి నడిపిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఈ బస్సులు నడుపుతోంది.
దసరా స్పెషల్ బస్సుల్లో ధరల సవరణ..: దసరా స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం టికెట్ ధరలను సవరించనున్నారు. తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు ఈ సవరణ ఉంటుంది. ఈ నెల 20 నుంచి 30 వరకు, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిపే స్పెషల్ బస్సుల్లోనే సవరణ చార్జీలు అమల్లో ఉంటాయి. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.
ప్రయాణికులకు సకల సౌకర్యాలు
‘బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సిద్ధంగా ఉంది. గత దసరా కంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరు తదితర వసతులతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం. ప్రతి రద్దీ ప్రాంతంలో పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు’అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని సూచించారు. టీజీఎస్‌ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని తెలిపారు. ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను సంస్థ అధికారిక వెబ్‌సైట్ ్టజటట్టఛిbuట. జీn లో చేసుకోవాలని సూచించారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–69440000, 040–23450033ను సంప్రదించాలని తెలిపారు.