
ఆర్టీసీలో వేల సంఖ్యలో కార్గో బుకింగ్‌లు
తీసుకోకుండా వదిలేస్తున్న వినియోగదారులు
ప్రతి నెలా 500కుపైగా వస్తువుల డెలివరీ పెండింగ్
ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి గృహోపకరణాల దాకా
వేలానికి సిద్ధం చేసిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: తక్కువ ధరల్లో నాణ్యమైన బ్రాండెడ్ వస్తువులు ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. షాపింగ్ సెంటర్లు, మాల్స్, సూపర్ మార్కెట్లు, వస్త్ర దుకాణాల్లో లభించాల్సిన వస్తువులు ఆర్టీసీ బస్టేషన్‌లలో విక్రయించనున్నారు. గుట్టలుగా పేరుకుపోతున్న రకరకాల వస్తువులను ఆర్టీసీ వేలం వేసి అమ్మనుంది. ఆర్టీసీ బిడ్డింగ్‌కు వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఇందుకోసం చాలామంది పోటీపడుతున్నారు. వివిధ రకాల వస్తువులపై నిర్ణీత ధరల కంటే 30 నుంచి 50 శాతం వరకు తక్కువ ధరల్లో లభిస్తుండటంతో కొనుగోలుదారులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ప్రతి నెలా వందలాది వస్తువులను ఇలా బిడ్డింగ్ ద్వారా అమ్మకానికి పెడుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ కార్గో విభాగానికి చెందిన ఉద్యోగి ఒకరు తెలిపారు.
మహాత్మాగాందీ, జూబ్లీ బస్టేషన్‌లలో ప్రధాన పార్శిల్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ రెండు కేంద్రాల నుంచే తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు పార్శిళ్లు పంపిణీ అవుతాయి. ప్రతి నెలా సుమారు 5000 నుంచి 6000 పార్శిళ్లను ఆర్టీసీ కార్గో చేరవేస్తోంది. కానీ.. పలు కారణాలతో ప్రతి నెలా 500 నుంచి 850 వరకు పార్శిళ్లు డెలివరీ కాకుండా నిలిచిపోతున్నాయి. ఇలా పెండింగ్‌లో పేరుకుపోయిన వస్తువులను ఆర్టీసీ అధికారులు విక్రయానికి వేలం పెట్టేస్తున్నారు.
బుక్ చేసి.. వదిలేసి..
హైదరాబాద్ నుంచి జిల్లాలకు, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున వస్తువులు రవాణా అవుతున్నాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్‌లు, టీవీలు, దుస్తులు, మందులు, ఆహార పదార్థాలు, పచ్చళ్లు, తినుబండారాలు వంటి వివిధ రకాల వస్తువులను ఆర్టీసీ కార్గో ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేస్తోంది. సాధారణంగా బంధువులు, స్నేహితులు ఒకరికొకరు పంపించుకొనే పార్శిళ్లు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా వినియోగదారులకు చేరుతాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆర్టీసీ పార్శిల్ కేంద్రాలకు వెళ్లి తమ పేరిట వచ్చిన ఆర్డర్‌లను వినియోగదారులు తీసుకెళ్తారు. కానీ.. కొంతమంది 45 రోజులు దాటిన తరువాత కూడా వస్తువులను తీసుకెళ్లకుండా వదిలేస్తున్నారు.
ఇలాంటి పెండింగ్ డెలివరీల్లో ఆర్టీసీ అధికారులు సంబంధిత వినియోగదారులకు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన లభించకపోవడం గమనార్హం. ‘చాలా వరకు క్యాష్ ఆన్ డెలివరీపై బుక్ చేసే ఆటోమొబైల్ వస్తువులు, ఎలక్ట్రిక్ వస్తువులను వినియోగదారులు తీసుకోకుండా వదిలేస్తున్నారు. కొన్ని పార్శిళ్లపై తప్పుడు అడ్రస్‌లు, తప్పుడు ఫోన్ నంబర్లు నమోదై ఉంటున్నాయి’ అని జూబ్లీ బస్టేషన్ కార్గో అధికారి ఒకరు తెలిపారు. వివిధ రకాల పార్శిళ్లను 3 రోజుల వ్యవధిలో వినియోగదారులకు ఉచితంగా అందజేస్తారు. ఆ తరువాత రూ.25 చొప్పున వసూలు చేస్తారు. రోజుల తరబడి డెలివరీ కాకపోవడంతో పార్శిల్ చార్జీలు (Parcel Charges) అనూహ్యంగా పెరుగుతాయి. ఆ రకంగా కూడా కొందరు తమ వస్తువులను వదిలేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిబంధనల మేరకే వేలం..
ప్రస్తుతం మహాత్మాగాంధీ బస్టేషన్‌లో 350 వస్తువులు, సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్‌లో మరో 542 వస్తువులు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. మరో వారం తరువాత ఈ వస్తువులను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్గో నిబంధనల మేరకు 45 కంటే ఎక్కువ రోజులు డెలివరీ కాకుండా పెండింగ్‌లో ఉన్న వస్తువులను వేలం (Auction) వేసేందుకు ముందు ఆర్టీసీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తోంది.
చదవండి: హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు బంద్.. ఎప్పుడంటే?
ఆ కమిటీ సమక్షంలో పెండింగ్ వస్తువుల జాబితాను తయారు చేస్తారు. వాటి అసలు ధరపై మొదటి విడత వేలంలో 50 శాతం తగ్గించి వేలానికి సిద్ధంగా ఉంచుతారు. అదే వస్తువును రెండోసారి వేలం వేస్తే 30 శాతం ధరలకే వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో జూబ్లీ, మహాత్మాగాంధీ బస్టేషన్‌లలోనూ వేలం నిర్వహించనున్నారు.