
సబ్జెక్టు ఏదైనా సెర్చ్ ఇంజిన్‌కే ప్రాధాన్యం
విద్యార్థుల్లో మారుతున్న ట్రెండ్ పాఠాలు, కంటెంట్ కోసం ‘యాప్’లను ఆశ్రయిస్తున్న వైనం
స్కూలు స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ ఇదే తీరు
విషయం సులభంగా మెదడు పొరల్లోకి చేరుతోందంటున్న శాస్త్రవేత్తలు
సాక్షి, హైదరాబాద్: గత దశాబ్ద కాలంగా విద్యార్థుల పంథా మారుతోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువు స్థానాన్ని ఆన్‌లైన్ యాప్‌లతో భర్తీ చేసుకుంటున్నారు. కాలేజీ స్థాయిలో పాఠాలు వినడమూ కష్టమవుతోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పిల్లలు ఆన్‌లైన్ పాఠాలకు అలవాటు పడ్డారు. అకడమిక్ పాఠమైనా, మరో ఇతర అంశమైనా సెర్చ్ ఇంజిన్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే యాప్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
విస్తృతమైన సమాచారం (కంటెంట్)తో ఇవి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. విద్యార్థులు ఐఐటీ ముంబై, మద్రాస్ సంస్థలు ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాలేజీలో మాస్టార్ పేరు తెలియని వాళ్ళు కూడా, ఆన్‌లైన్ యాప్‌ల పేర్లు ఇట్టే చెప్పేస్తున్నారనేది పరిశోధన సారాంశం.
పాఠశాల విద్యలో నూటికి 68 మంది, ఉన్నత విద్యలో 83 మంది ఆన్‌లైన్ ద్వారా నేర్చుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. మ్యాథ్స్‌లో మూ ల్యాంకనలకు, ఫిజిక్స్‌లో మ్యాగ్నటిక్ డైమెన్షన్స్, కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్, బోటనీలో బయలాజికల్ క్లాసిఫికేషన్‌కు ఆన్‌లైన్ శోధనే బెస్ట్ అంటున్నారు. అధ్యాపకుడు చెప్పే దానికన్నా మెరుగైన సబ్జెక్ట్ నాలెడ్జ్ అందుతోందని చెబుతున్నారు.
ఆన్‌లైన్‌తో దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి
మెదడులో ముఖ్య భాగం న్యూరాన్ వ్యవస్థ. జ్ఞాపక శక్తికి ఇది కీలకం. ఈ వ్యవస్థ ఇప్పుడు ఆన్‌లైన్ చదువుకు అలవాటు పడుతోందని పరిశోధనల్లో తేలింది. ఆన్‌లైన్‌లో చదవడం వల్ల హిప్పో కాంపస్ (జ్ఞా పకశక్తిని నిల్వ చేయడం)కు సంబంధించి మెరుగైన ఫలితాలు ఇస్తోందని కెనడా యూనివర్సిటీ శాస్త్రవేత్త జాన్ విలియం ఇటీవల వెల్లడించారు. స్కూల్ లేదా కాలేజీలో చదివిన విషయం మెదడులో తాత్కాలిక జ్ఞాపక శక్తిగా ఉంటోందని, ఆన్‌లైన్ ద్వారా చదివేటప్పుడు మెదడులోని న్యూరాన్ వ్యవస్థ తేలికగా దీన్ని దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిగా మారుస్తోందని ఆయన పరిశోధనలో తేలింది.
క్లాస్ రూంలో పాఠం వినేప్పుడు సిగ్నల్ వ్యవస్థ అయిన మెదడు రసాయన చర్య కారణంగా కొంత ఒత్తిడి గురవుతోందని, అయితే ఆన్‌లైన్‌లో ఏకాగ్రత వల్ల సున్నితంగా మెదడు పొరల్లోకి విషయం చేరుతోందని గత ఏడాది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు క్లాస్ రూం బోధన కన్నా, ఆన్‌లైన్ చదువు తేలికగా ఉందని భావిస్తున్నారు. అయితే, సబ్జెక్టుకు సంబంధించి వచ్చే సందేహాలు ఆన్‌లైన్‌లో నివృత్తి చేసుకునే క్రమంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. చాట్ జీపీటీ, ఇతర బ్రౌజర్లు విభిన్న సమాచారాన్ని అందిస్తుండటమే ఇందుకు కారణం.
ఈ–పాఠాలు.. ఎన్నో యాప్‌లు
ఈ–పాఠశాల:
ఎన్‌సీఈఆర్‌టీ, సీఐఈటీ ఆధ్వర్యంలో నడిచే ఈ–పాఠశాల పాఠ్యపుస్తకాలు, ఆడియో, వీడియో, ఇతర విద్యా వనరులను అందిస్తోంది.
డౌట్‌నట్ :
గణితం, అణుశా్రస్తానికి సంబంధించిన సందేహాలను ఇది దృశ్యరూపాల్లో ఆప్‌లోడ్ చేసి అందిస్తోంది. ఈ యాప్ ద్వారా వీడియోలతో కూడిన అర్థవంతమైన సమాధానాలు పొందే వీలుంది.
అన్‌అకాడమీ:
జేఈఈ, నీట్, యూపీఎస్‌సీ, ఎస్సెస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉద్దేశించి దీన్ని రూపొందించారు. ప్రశ్నలకు సమాధానాలు, ఆన్‌లైన్ పరీక్ష విధానం, నిష్ణాతులైన అధ్యాపకుల లెక్చర్స్ ఇందులో ఉంటున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు దీన్ని అనుసరిస్తున్నారు. నీట్, జేఈఈ కోసం అమెజాన్ అకాడమీ కూడా పనిచేస్తోంది. ఇక యూనివర్సల్ బోధన పద్ధతులతో ఖాన్ అకాడమీ ప్రాక్టికల్ విద్య బోధనతో ఆన్‌లైన్ రంగంలో విద్యార్థులను ఆకర్షిస్తోంది. స్థానిక భాషల్లో ప్రోగ్రామింగ్ చేసిన గువీ, టెక్ డేటా సైన్స్ నైపుణ్యాలతో ఎడ్యురేకా వంటి యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి
ఆన్‌లైన్ బోధనకే పరిమితం కాకూడదు
కాలానుగుణంగా వస్తున్న మార్పులతో ఆన్‌లైన్ విద్యా విధానం అనివార్యమైంది. అదనపు స్కిల్స్, సమాచారం కోసం ఆన్‌లైన్‌కు వెళ్ళడం మంచిదే. కానీ ఆన్‌లైన్ బోధనకే పరిమితం కావడం సరైన విధానం కాదు. దీనివల్ల క్లాస్ రూం కనెక్టివిటీ పోతుంది. అందువల్ల అంతర్జాతీయ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు, సంప్రదాయ అకడమిక్ బోధన పద్ధతులపైనా దృష్టి పెట్టాలి.
– ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (చైర్మన్, ఉన్నత విద్యా మండలి)