
'ఎవరు ఏం తింటారో తెలుసుకోవాలన్న ఆసక్తి మా ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయ'ని అన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. పంద్రాగస్టు నాడు మాంసం దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలపై విమర్శలు రావడంతో ఆయన ఈవిధంగా స్పందించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఫుడ్ చాయిస్‌పై ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించగా, ముందుగా మొదలు పెట్టింది మీరేనని బీజేపీ కౌంటరిచ్చింది.
అసలేం జరిగింది?
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పశువధ శాలలు, మాంసం దుకాణాలు మూసివేయాలని మహారాష్ట్రలోని పలు నగర పాలక సంస్థలు అధికారికంగా ఆదేశాలిచ్చాయి. డోంబివ్లి, కొల్హాపూర్, నాసిక్, ఇచల్కరంజి, జల్గావ్ సహా పలు నగరాల్లో ఇలాంటి ఆదేశాలు వెలుపడ్డాయి. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కూడా ఆంక్షలు ఏమిటంటూ జనంతో పాటు పలువురు నాయకులు ప్రశ్నించారు. దీంతో సీఎం ఫడ్నవీస్ స్పందించారు.
'ఎవరేం తినాలో చెప్పాలన్న ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మా ముందు చాలా సమస్యలు ఉన్నాయ'ని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యేక దినాల్లో పశువధ శాలలు మూసివేయాలని 1988లో ప్రభుత్వం తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దీన్ని ఆనవాయితీగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఆదేశాలు అమలు చేశార'ని వెల్లడించారు. కాగా, పంద్రాగస్టు నాడు కబేళాల మూసివేత ఆదేశాలను శరద్ పవార్ సీఎంగా ఉన్నప్పుడే మొట్ట మొదటిసారిగా అమలు చేశారని బీజేపీ పేర్కొంది.
కరెక్ట్‌కాదు: పవార్
పంద్రాగస్టు నాడు మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. 'ఇలాంటి నిషేధం సరికాదు. వివిధ మతాలు, కులాలకు చెందిన వారు పెద్ద నగరాల్లో నివసిస్తుంటారు. మహావీర్ జయంతి, మహాశివరాత్రి పర్వదినాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించినా ప్రజలు ఆమోదిస్తారు. కానీ స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఎటువంటి ఆంక్షలు విధించరాదని ప్రజలు కోరుకుంటార'ని చెప్పారు.
నాన్-వెజ్ తింటా: జితేంద్ర
చికెన్, మటన్ సహా అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి నాన్-వెజ్ తింటామని ఎన్సీపీ- శరద్‌పవార్ వర్గం నేత జితేంద్ర అహ్వాద్ ప్రకటించారు. మరోవైపు తమ ఆదేశాలను వెనక్కు తీసుకోబోమని కేడీఎంసీ (KDMC) స్పష్టం చేసింది.
హర్షవర్ధన్ ఆశ్చర్యం
పంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలను నిషేధిస్తూ వివిధ నగర పాలక సంస్థలు ఉత్తర్వులు జారీ చేయడంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను తప్పుబడుతూ, ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఏం తినాలో నిర్దేశించి హక్కు ప్రభుత్వానికి లేదన్నారాయన.
చదవండి: పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
హైదరాబాద్‌లోనూ..
పంద్రాగస్టు, జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 15, 16 తేదీల్లో పశువధ శాలలు మూసివేయాలని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే చికెన్, చేపల విక్రయాలపై ఎటువంటి ఆంక్షలు లేవని.. బీఫ్ విక్రయశాలలపై మాత్రమే నిషేధం ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ ఆదేశాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నిషేధం పంద్రాగస్టును మినహాయించాలని కొంతమంది కోరారు. కాగా, బీఫ్ దుకాణాలు, కబేళాలు సంవత్సరంలో ఏడు రోజులు మూసివేయడం అనేది రెండు దశాబ్దాలకు పైనుంచి జరుగుతోందని అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే కొన్ని ప్రత్యేక దినాల్లో బీఫ్ అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని వివరించారు. గాంధీ జయంతి, వర్ధంతి నాడు మటన్ విక్రయించరని చెప్పారు.
అమానుషం: అసదుద్దీన్
ఆగస్టు 15న కబేళాలను మూసివేయడం అమానుషం, రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సంతోషకరమైన సందర్భమని, ఇలాంటి రోజున ఆంక్షలు విధించడం సరికాదన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వరుసగా రెండు రోజులు కబేళాలు మూసివేయాల్సిన పరిస్థితి రావడంతో, తమ జీవనోపాధి దెబ్బ తింటుందని దుకాణాదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఆదేశాలను లా స్టూడెంట్ ఒకరు కోర్టులో సవాల్ చేశారు.