
పల్లెటూరు అనగానే మననందరికీ గుర్తుకు వచ్చేది పచ్చని పొలాలు, పొందికైన ఇళ్లు, నినాదంగా గడిచే జీవితం. కానీ ఆ ఊరు అలా ఉండదు. పేరుకే పల్లెటూరు, దాని తీరు చూస్తే నగరానికి ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఆ ఊరు ఆసియాలోనే సంపన్న గ్రామం. ఇంతకీ ఇది ఎక్కడుందనేగా మీ డౌటు. ఇంకెక్కడ మన ఇండియాలోనే. ఏంటి ఏషియా రిచెస్ట్ విలేజ్ మనదేశంలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా! మరి ఇంకేందుకు ఆలస్యం.. ఆ ఊరు ఎక్కడ ఉందో, దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం.. ఆసియాలోనే ధనిక గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. ఎటు చూసినా కాంక్రీట్ బిల్డింగ్‌లు, ఆధునాతన సౌకర్యాలతో అలరారుతూ ఉంటుంది ఈ విలేజ్. ఈ ఊర్లోని బ్యాంకుల్లో రూ. 7 వేల కోట్లు పైగా డిపాజిట్లు ఉన్నాయంటేనే అర్థమవుతుంది ఈ ఊరు రేంజ్. దేశంలోని మిగతా పల్లెటూళ్లకు భిన్నంగా ఉంటుంది మాధపర్ (Madhapar). ఈ గ్రామంలో 20 వేల ఇళ్లు ఉండగా.. దాదాపు 32,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఊరు సంపన్న గ్రామంగా ఎలా ఎదిగింది, ఇక్కడివారు ఏం చేస్తారనే తెలుసుకోవాలనుకుంటున్నారా?
గ్లోబల్ రూట్స్, లోకల్ గ్రోత్
మాధపర్ విజయ రహస్యం అక్కడి ప్రజలే. ఇక్కడి కుటుంబాల్లోని చాలా మంది అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా స్వగ్రామానికి దండిగా డబ్బులు పంపిస్తుంటారు. తాము ఉంటున్న దేశంలో కంటే మాధపర్ బ్యాంకుల్లో డబ్బును దాచుకోవడానికి ఇష్టపడతారు. ఇంటికి డబ్బు పంపడమే కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా స్థిరమైన వృద్ధితో ఆర్థిక స్వావలంబన సాధించి సంపన్న గ్రామంగా ఎదిగింది మాధపర్ గ్రామం.
ప్రవాసంలో ఉంటున్నా..
దేవాలయాలు, వారసత్వ కట్టడాలను సృష్టించడంలో సిద్ధహస్తులైన మిస్త్రి కమ్యునిటికి చెందిన వారు 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. కాలక్రమేణా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం పటేల్ కమ్యునిటికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు ఇక్కడి నుంచి చాలా మంది వలస వెళ్లడంలో మాధపర్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రవాసంలో ఉంటున్నా మూలాలను మరిచిపోకుండా సొంతూరిపై ఎన్నారైలు మమకారం చూపడంతో మాధపర్ ధనిక గ్రామంగా ఎదిగింది. పట్టణాలకు దీటుగా సౌకర్యాలు సమకూర్చుకుంది. విశాలమైన రోడ్లు, నాణ్యమైన పాఠశాలలు, కాలేజీలతో పాటు ఆధునిక వైద్యాన్ని అందించే ఆస్పత్రులు కూడా ఉన్నాయి.
చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!
దేశానికి నమూనా
మాధపర్ విజయగాథ కేవలం సంపదకు సంబంధించినది మాత్రమే కాదు. ఐక్యత, దార్శనికత, తిరిగి ఇవ్వడం అనే మూడు అంశాల ఆధారంగా మాధపర్ గ్రామం స్వావలంబన సాధించింది. అంతేకాదు ప్రజల మధ్య బలమైన సమాజ సంబంధాలు ఉంటే గ్రామీణ జీవితాన్ని కూడా అసాధారణంగా మార్చవచ్చని ఈ ఊరు నిరూపించింది. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని ఆధునిక జీవన సౌకర్యాలతో మిళితం చేసి దేశానికి నమూనాగా నిలిచింది.