పిల్ల‌లంతా క‌లిసి కోట్లు కూడ‌బెట్టారు! | How Gujarat Bal Gopal Bank empowers next generation PN | Sakshi
Sakshi News home page

బాల‌గోపాల్ బ్యాంక్ గురించి విన్నారా?

Aug 2 2025 5:40 PM | Updated on Aug 2 2025 7:44 PM

How Gujarat Bal Gopal Bank empowers next generation PN

ఇంజ‌నీరింగ్‌లో చేరిన 17 ఏళ్ల క‌పిశ్ ల్యాప్‌టాప్ కొనుక్కోవ‌డానికి వాళ్ల నాన్న‌ను డ‌బ్బులు అడిగాడు. కాలేజీ ఫీజుకే అప్పుచేసిన అత‌డి తండ్రి ల్యాప్‌టాప్ కొన‌డానికి మ‌ళ్లీ అప్పు చేయ‌డానికి రెడీ అయ్యాడు. చ‌దువులు అన్నాక అవ‌స‌ర‌మైన‌వి కొన‌క త‌ప్ప‌దు. ఈ రోజుల్లో ఉన్న‌త చ‌దువుల‌కు పెద్ద మొత్తంలో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టాల్సివ‌స్తోంది. ఫీజుల‌తో పాటు పుస్త‌కాలు, ల్యాప్‌టాప్‌ల కోసం అద‌నంగా బ‌డ్జెట్ స‌మ‌కూర్చుకోవాల్సి వ‌స్తోంది. దీంతో పిల్ల‌ల‌ చ‌దువులు త‌ల్లిదండ్రుల‌కు త‌ల‌కు మించిన భారం అవుతున్నాయి. అయితే త‌మ‌కు అలాంటి బాధ లేదంటున్నారు గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా ఇదార్ తహసీల్‌లోని గ్రామాలకు చెందిన ప్ర‌జ‌లు. ఎందుకంటే వారికి అండ‌గా బాల‌గోపాల్ బ్యాంక్ ఉంది. నిజానికిది బ్యాంక్ కాదు, కోప‌రేటివ్ సొసైటీ!

ప‌ల్కిన్ రావ‌ల్ అనే 12వ త‌ర‌గ‌తి విద్యార్థిని తాను కూడ‌బెట్టిన డ‌బ్బుల‌తో ఇటీవ‌ల ల్యాప్‌టాప్ (Laptop) కొనుక్కుంది. ప‌దో త‌ర‌గ‌తి ట్యూష‌న్‌ ఫీజు కూడా త‌న సేవింగ్స్ నుంచే క‌ట్టింది. అంతేకాదు కొత్త‌ సైకిల్ కూడా కొనుక్కుంది. బాల‌గోపాల్ బ్యాంక్‌లో దాచుకున్న డ‌బ్బుతో ఇవ‌న్ని చేసింది. ఇంత చేసి ఆమెది  ధ‌న‌వంతులు కుటుంబమేమీ కాదు. ఇదార్ ప‌ట్ట‌ణంలో వాళ్ల నాన్న టీ స్టాల్ న‌డుపుతాడు. బాల‌గోపాల్ బ్యాంక్‌లో క్ర‌మంగా త‌ప్ప‌కుండా చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే వారి అవ‌స‌రాలు తీరుస్తోంది. ప‌ల్కిన్ రావ‌ల్ తోబుట్టువులు కూడా ఇదే బ్యాంక్‌లో పొదుపు చేస్తున్నారు. దాదాపు 30 వేల మందిపైగా పిల్ల‌లు ఈ బ్యాంక్‌లో త‌మ‌ డ‌బ్బులు దాచుకుంటున్నారు. ఇలా పిల్లలు పొదుపు చేసిన మొత్తం రూ. 30 కోట్లు పైమాటే అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఇంత‌కీ బాల‌గోపాల్ బ్యాంక్ (Bal Gopal Bank) ఇదంతా ఎలా చేయ‌గ‌లిగింది?

ఎవ‌రు స్థాపించారు?
ఇదార్ ప‌ట్టణ‌వాసి అశ్విన్ ప‌టేల్ ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిరూప‌మే ఈ బాల‌గోపాల్ బ్యాంక్. 16 ఏళ్ల క్రితం ఆయ‌న ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు. రైతుల‌కు, మ‌హిళ‌ల‌కు స‌హ‌కార సంఘాలు ఉన్నట్టుగా పిల్ల‌ల‌కు ఎందుకు లేవ‌న్న ప్ర‌శ్న ఆయ‌న‌కు ఎదురైంది. దీనికి స‌మాధానంగా 2009, మే 30న సబర్కాంత జిల్లాలోని జ‌వాన్‌పురా గ్రామంలో 'బాల‌గోపాల్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ కోప‌రేటివ్ సొసైటీ' స్థాపించారు. 100 మంది పిల్ల‌లతో ప్రారంభ‌మైన ఈ సంస్థ‌లో ఇప్పుడు 335 గ్రామాల నుంచి 30 వేలమందిపైగా పిల్ల‌లు స‌భ్యులుగా ఉన్నారు. దేశంలో పిల్ల‌ల కోసం న‌డుస్తున్న ఏకైక స‌హ‌కార సంస్థ త‌మదేన‌ని 58 ఏళ్ల అశ్విన్ ప‌టేల్ వెల్ల‌డించారు. దీంతో స్థానికంగా అంద‌రూ దీన్ని బాల‌గోపాల్ బ్యాంక్‌గా పిలుస్తున్నారు.  

ఎలా ప‌ని చేస్తుంది?
పిల్ల‌లు పుట్టిన వెంట‌నే త‌ల్లిదండ్రులు రూ. 110 చెల్లించి బాల‌గోపాల్ బ్యాంక్‌లో ఖాతా తెర‌వాలి. వారికి సంస్థ ప్ర‌తినిధులు ఒక పిగ్గీ బ్యాంక్ (డిబ్బి) ఇస్తారు. ఇందులో పొదుపు చేసిన డ‌బ్బును ప్ర‌తినెలా ఇంటికి వ‌చ్చి త‌ల్లిదండ్రులు లేదా పెద్ద‌వారి స‌మ‌క్షంలో లెక్కిస్తారు. త‌ర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్లి పిల్ల‌ల ఖాతాల్లో వేస్తారు. పొదుపు చేసిన డ‌బ్బుకు సంవ‌త్స‌రానికి 6 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. పిల్ల‌లు త‌మ‌కు అవ‌స‌ర‌మైన‌ప్ప‌డు లోన్లు కూడా తీసుకోవ‌చ్చు. వెయ్యి మందిపైగా రుణాలు తీసుకున్నార‌ని బ్యాంక్ తెలిపింది. 

బాల‌గోపాల్ బ్యాంక్ ప‌నితీరు ప్ర‌శంస‌నీయంగా ఉండ‌డంతో ఆద‌ర‌ణ అంత‌కంత‌కు పెరుగుతోంది. 'మొద‌ట్లో పిల్ల‌ల‌తో పొదుపు ప్రారభింప‌జేయ‌డానికి స్థానిక పాఠ‌శాల‌ల్లో ప్ర‌త్యేకంగా స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేవాళ్లం. ఇప్పుడైతే త‌ల్లిదండ్రులే త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి వ‌చ్చి బ్యాంక్‌లో ఖాతాలు తెరుస్తున్నార‌'ని అశ్విన్ ప‌టేల్ తెలిపారు. 10 నుంచి 12 పిల్ల‌లు త‌మ ద‌గ్గ‌ర పొదుపు చేసిన డ‌బ్బుతో ఎంబీబీఎస్ మొద‌టి సంవ‌త్స‌రం ఫీజులు చెల్లించార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అప్పుడే పుట్టిన పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి 18 ఏళ్ల‌లోపు ఎవ‌రైనా త‌మ సంస్థ‌లో డ‌బ్బులు దాచుకోవ‌చ్చ‌ని చెప్పారు. దీంతో స్థానికంగా అంద‌రూ దీన్ని 'పిల్ల‌ల‌ బ్యాంక్‌'గా పిలుస్తున్నారు.

పేరెంట్స్ ప్ర‌శంస‌లు
బాల‌గోపాల్ బ్యాంక్ సేవ‌ల‌ను పేరెంట్స్ ప్ర‌శంసిస్తున్నారు. త‌మ పిల్ల‌లు చిన్న‌త‌నం నుంచే ఆర్థిక అక్షరాస్యత, పొదుపు పాఠాలను ప్రాక్టిక‌ల్‌గా నేర్చుకుంటున్నార‌ని వారు అంటున్నారు. డ‌బ్బు పొదుపు ప్రాముఖ్య‌త‌తో పాటు, సేవ్ చేసిన సొమ్ముల‌ను స‌రైన వాటికి ఖ‌ర్చుచేయ‌డం వారికి అల‌వాటు అవుతోందని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. పొదుపు చేసిన డ‌బ్బుతో పిల్ల‌ల చ‌దువులు స‌జావుగా సాగుతున్నాయ‌ని తెలిపారు.

చ‌ద‌వండి: పిల్ల‌లూ బ్యాంక్ త‌లుపు త‌ట్టండి!

పైలట్ ప్రాజెక్ట్‌గా.. 
బాల‌గోపాల్ బ్యాంక్ విజ‌య‌వంతంగా న‌డుస్తుండ‌డంతో దీన్ని మిగ‌తా ప్రాంతాల్లోనూ అమ‌లు చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 25 పాఠ‌శాల‌ల్లో 'బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజన’ పైలట్ ప్రాజెక్ట్‌గా అమ‌లు చేస్తోంది. 5 నుంచి 18 ఏళ్ల వ‌య‌సున్న పిల్ల‌ల కోసం దీన్ని ప్ర‌వేశ‌పెట్టింది. గుజ‌రాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్ సొంత నియోజ‌క‌వ‌ర్గం ఘట్లోడియాలోని గుజ‌రాతీ, హిందీ, ఇంగ్లీషు మీడియం స్కూళ్ల‌లో బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజనను తాత్కాలికంగా అమ‌లు చేస్తున్నారు. బాల‌గోపాల్ బ్యాంక్ గురించి తెలిసిన వారు త‌మ ప్రాంతంలోనూ ఇలాంటి పిల్ల‌ల బ్యాంకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement