
ఇంట్లో నాన్న తీసుకొచ్చిన కిడ్డీబ్యాంక్ గుర్తుందా.. అమ్మ, నాన్న, ఎప్పుడైనా బంధువులు వస్తూపోతూంటే ఇచ్చే చిల్లర డబ్బులు దాచుకునేందుకు కిడ్డీబ్యాంకు ఉపయోగిస్తారు. ఏదైనా అత్యవసర సమయాల్లో పిల్లలు ఆ డబ్బును వాడుకుంటారు. చిన్నప్పటి నుంచే డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకోయాలని అలా చేస్తారు. స్కూల్‌కు వెళ్లే దారిలోనో..సండే అలా పేరెంట్స్‌తో సరదాగా బయటకు వెళ్లే సమయంలోనే ఎస్‌బీఐ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ అని పేర్లు కనిపిస్తుంటాయి. ఇంట్లో ఉన్న కిడ్డీబ్యాంకు గురించి తెలుసుకానీ.. ఇవేం బ్యాంకులని చిన్నారుల్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి.
ఈ బ్యాంకులు కూడా ఇంట్లోని కిడ్డీ బ్యాంకుల్లాగే పని చేస్తాయి. పిల్లలు నిత్యం ఎలాగైతే డబ్బు పొదుపు చేసి అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారో.. అదే మాదిరిగా సేవింగ్స్, ఎఫ్‌డీ వంటి ఖాతాలో డబ్బు దాచుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. కాదంటే.. కిడ్డీ బ్యాంకులో ముందుగా ఎంతైతే డబ్బు వేస్తామో చివరిదాకా అంతే మొత్తం ఉంటుంది. కానీ బయట చూసే బ్యాంకుల్లో డబ్బు దాస్తే కొంత అధిక మొత్తం కలిపి ఇస్తారు. ఇలా బ్యాంకువారు కలిపి ఇచ్చే మొత్తాన్నే వడ్డీ అంటారు. కాబట్టి ప్రాథమికంగా కిడ్డీబ్యాంకులో డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకొని, తర్వాత బ్యాంకుల్లో దాచుకోవడం నేర్చుకోవాలి. దాన్నివల్ల అదనంగా వడ్డీ సమకూరుతుంది కదా!
పిల్లలే నేరుగా బ్యాంకు ఖాతాను తెరిచేందుకు వెళ్తే పాటించాల్సినవి..
బ్యాంకులోకి ఎంటర్ అయ్యే ముందు గేట్‌వద్దే తుపాకీ పట్టుకొని బారుమీసాలతో గంభీరంగా ఒక వ్యక్తి ఉంటాడు. చిన్నారులూ.. అతడిని చూసి భయపడకండి. ఆ మీసాల మామ మనోడే.. మీ ఇంట్లోనీ కిడ్డీ బ్యాంకును ఎలాగైతే జాగ్రత్తగా ఒకచోట దాస్తారో.. అలాగే ఆ బ్యాంకుకు తాను నిత్యం భద్రత అందిస్తూ కాపలాకాస్తాడు. కాబట్టి మీరు వేసే డబ్బులు మరింత భద్రంగా ఉంటుంది.
మామకు గుడ్‌మార్నింగ్ చెప్పి బ్యాంకులోకి వెళితే చాలామంది ఉంటారు. వారిలో చాలావరకు బ్యాంకులో ఏదోఒక పని కోసం వచ్చినవారే. కంగారు పడకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్‌లో కూర్చున్నవారిని గమనించండి. వారే బ్యాంకు సిబ్బంది.
బ్యాంకులో డిపార్ట్‌మెంట్ల వారీగా చాలా మంది సిబ్బంది పని చేస్తారు. అంటే.. డబ్బులు మన నుంచి తీసుకునే వారు కొందరు ఉంటే.. ఇప్పటికే బ్యాంకులో డబ్బు వేస్తే తిరిగి ఇచ్చేవారు ఇంకొందరుంటారు. దాంతోపాటు ప్రత్యేకంగా లోన్లు ఇచ్చే వారుంటారు. మీ తరగతిలో లీడర్ ఎలాగైతే ఉంటాడో.. బ్యాంకులోనూ వీరందరినీ మ్యానేజ్ చేసే లీడర్ ఉంటారు. అతడే మేనేజర్.
ప్రతి బ్యాంకులో ‘మే ఐ హెల్త్ యూ’ అని లేదా ‘ఎంక్వైరీ’ సైన్ బోర్డుతో ఒక క్యాబిన్ ఉంటుంది. అందులో ఉన్న అంకుల్ దగ్గరకు వెళ్లి.. ‘బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయానుకుంటున్నాను.. ప్రాసెస్ ఏంటి’ అని అడిగితే తాను ఖాతా ఓపెన్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల గురించి చెబుతారు. దాంతోపాటు ఎలాంటి రకాల ఖాతాలున్నాయో వివరిస్తారు.
పిల్లల కోసం బ్యాంకులు అందిస్తున్న కొన్ని ఖాతాలు..
యూత్ లేదా మైనర్ అకౌంట్: ఇది మైనర్ల కోసం రూపొందించిన ప్రామాణిక పొదుపు ఖాతా. ఇది సాధారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఖాతాకు జోడించబడి ఉంటుంది. ఈ ఖాతాలను చిన్న మొత్తాలను నిర్వహించవచ్చు.
కస్టోడియల్ అకౌంట్: ఈ ఖాతా పిల్లల పేరు మీదే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు పిల్లల వయసు (సాధారణంగా 18 లేదా 21) వచ్చే వరకు ఖాతాను నిర్వహిస్తాడు.
జాయింట్ అకౌంట్: కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు తమ పిల్లలతో జాయింట్ అకౌంట్ తెరిచేందుకు అనుమతిస్తాయి. ఈ ఖాతాలో పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి నిర్వహించవచ్చు.
బ్యాంకు ఎంచుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలకు ఒకే రకమైన ప్రయోజనాలు అందించవు. ఆన్‌లైన్ సహాయంతో పిల్లల ఖాతాలు తెరిచేందుకు అనువైన బ్యాంకులను సెర్చ్ చేయాలి.
నెలవారీ రుసుము లేకుండా.. నెలవారీ రుసుము వసూలు చేయని బ్యాంకులను ఎంచుకోవాలి. ఎందుకంటే దీని వల్ల పిల్లల చిన్నపాటి పొదుపు హరించుకుపోతుంది.
తక్కువ లేదా నో మినిమమ్ డిపాజిట్.. కొన్ని బ్యాంకుల్లో ఖాతా తెరవడానికి కనీస డిపాజిట్ అవసరం ఉంటుంది. కాబట్టి తక్కువ లేదా ఎలాంటి డిపాజిట్ అవసరంలేని బ్యాంకులను ఎంచుకోవాలి.
ఆన్‌లైన్ బ్యాంకింగ్.. చాలా బ్యాంకులు యువ ఖాతాదారుల కోసం మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను అందిస్తున్నాయి. అలాంటి సదుపాయం ఉన్న బ్యాంకుల తలుపు తట్టండి.
ఎడ్యుకేషనల్ టూల్స్.. కొన్ని బ్యాంకులు పిల్లలకు పొదుపు, బడ్జెట్, డబ్బు నిర్వహణ గురించి నేర్పడానికి రూపొందించిన సాధనాలను అందిస్తాయి. అలాంటి ఆర్థిక అక్షరాస్యత నేర్పే వాటిని ఎంచుకోవాలి.
ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు..
తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఐడీకార్డులు (డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మొదలైనవి).
చిరునామా రుజువు (యుటిలిటీ బిల్లు, లీజు ఒప్పందం మొదలైనవి).
పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్ (వయసును ధ్రువీకరించడానికి అవసరం)
చిరునామా రుజువు (పిల్లవాడి పేరు మీద శాశ్వత చిరునామా ఉంటే ఇవ్వాలి)
కొన్ని బ్యాంకులు అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు. కాబట్టి ఆయా బ్యాంకు వెబ్‌సైట్లలో ముందుగా వివరాలు తనిఖీ చేయడం మంచిది.