నిజమైన అభ్యాసం అంటే పరీక్షలు రాసి గ్రేడ్లు సాధించడం కాదు.. జీవితాన్ని కనుగొనడం, సృష్టించడం అని తొమ్మిదేళ్లకే అర్థం చేసుకున్నాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వేదార్థ్. అందుకే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే తరగతి గది గోడలుగా మార్చుకున్నాడు. ప్రతి క్షణాన్ని ఏదో అన్వేషించడానికి, సృష్టించడానికి.. తద్వారా ఉన్నతస్థాయికి ఎదగడానికే వినియోగిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 100కి పైగా పుస్తకాలు చదివాడు. రోబోటిక్స్, ఎల్‌ఈజీవో నిర్మాణం వంటి అంశాలపై వర్క్ షాపులకు వెళుతుంటాడు. ఏ సవాల్‌నైనా ఉత్సాహంతో ఎదుర్కొంటాడు. ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకం చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం.. వాటిని జీవితంలో ఎలా వినియోగించుకోవాలా అని ఆలోచించడం.. అతడి నిత్యకృత్యంగా మారిపోయింది.
విద్యాభ్యాసాన్ని సరికొత్తగా పునర్ నిర్వచించుకున్న వేదార్థ్ (Vedarth) అక్కడితో ఆగిపోలేదు. సొంతగా కప్‌కేక్స్ తయారు చేసి విక్రయిస్తుంటాడు. చాక్లెట్ స్టాల్ ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు. ఆ సొమ్మును సిప్‌ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లో పెట్టుబడులు కూడా పెడుతున్నాడు. ఇలా ఇప్పటివరకు అతడు రూ.10 వేల వరకు పొదుపు చేశాడు. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన బాలుడిగా వేదార్థ్ గుర్తింపు పొందాడు.
తల్లే తొలి గురువు...
వేదార్థ్ తల్లి విశ్రుతి తన తొలి గురువు. ఆమె వేదార్థ్ జీవితానికి నిజంగా కావాల్సింది ఏమిటో ఓనమాల నుంచే నూరిపోశారు. స్కూల్‌లో బట్టీ పట్టడం ద్వారా వచ్చిన జ్ఞానం తన జీవితంలో పెద్దగా ఉపయోగపడలేదని గ్రహించిన విశ్రుతి.. తన కొడుకుకు ఉత్సుకత, వాస్తవ ప్రపంచ అనుభవంతో నిండిన బాల్యాన్ని అందించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. దీంతో అన్ స్కూలింగ్ అని పిలిచే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు.
చదవండి: హీరోయిన్ హోటల్ ముందు క్యూ కట్టిన జనం
అన్ స్కూలింగ్ (unschooling) విధానంలో నిర్ణీత పాఠ్యాంశాలు, షెడ్యూల్ లేదా పరీక్షల వంటివి ఉండవు. ఇక్కడ కేవలం ఆసక్తి ఆధారిత అభ్యాస విధానం, విద్య సహజమైన ఉత్సుకత, స్వీయ–నిర్దేశిత అన్వేషణ ఆధారంగా సాగుతుంది. ఇందులో భాగంగా విశ్రుతి డబ్బు సంపాదించడం, పెట్టుబడులు పెట్టడం గురించి ఆచరణాత్మక అవగాహన కల్పించడంతో వేదార్థ్ తల్లి ప్రోత్సాహంతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే తన మొదటి పుస్తకాన్ని ప్రచురించడానికి సిద్ధమవుతున్నాడు. వేదార్థ్.. నువ్వు వెరీవెరీ స్పెషల్..
– గౌతమి గిద్దిగాని, సాక్షి సెంట్రల్ డెస్క్


