breaking news
Kids bank
-
పిల్లలంతా కలిసి కోట్లు కూడబెట్టారు!
ఇంజనీరింగ్‌లో చేరిన 17 ఏళ్ల కపిశ్ ల్యాప్‌టాప్ కొనుక్కోవడానికి వాళ్ల నాన్నను డబ్బులు అడిగాడు. కాలేజీ ఫీజుకే అప్పుచేసిన అతడి తండ్రి ల్యాప్‌టాప్ కొనడానికి మళ్లీ అప్పు చేయడానికి రెడీ అయ్యాడు. చదువులు అన్నాక అవసరమైనవి కొనక తప్పదు. ఈ రోజుల్లో ఉన్నత చదువులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తోంది. ఫీజులతో పాటు పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ల కోసం అదనంగా బడ్జెట్ సమకూర్చుకోవాల్సి వస్తోంది. దీంతో పిల్లల చదువులు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. అయితే తమకు అలాంటి బాధ లేదంటున్నారు గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా ఇదార్ తహసీల్‌లోని గ్రామాలకు చెందిన ప్రజలు. ఎందుకంటే వారికి అండగా బాలగోపాల్ బ్యాంక్ ఉంది. నిజానికిది బ్యాంక్ కాదు, కోపరేటివ్ సొసైటీ!పల్కిన్ రావల్ అనే 12వ తరగతి విద్యార్థిని తాను కూడబెట్టిన డబ్బులతో ఇటీవల ల్యాప్‌టాప్ (Laptop) కొనుక్కుంది. పదో తరగతి ట్యూషన్ ఫీజు కూడా తన సేవింగ్స్ నుంచే కట్టింది. అంతేకాదు కొత్త సైకిల్ కూడా కొనుక్కుంది. బాలగోపాల్ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బుతో ఇవన్ని చేసింది. ఇంత చేసి ఆమెది ధనవంతులు కుటుంబమేమీ కాదు. ఇదార్ పట్టణంలో వాళ్ల నాన్న టీ స్టాల్ నడుపుతాడు. బాలగోపాల్ బ్యాంక్‌లో క్రమంగా తప్పకుండా చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే వారి అవసరాలు తీరుస్తోంది. పల్కిన్ రావల్ తోబుట్టువులు కూడా ఇదే బ్యాంక్‌లో పొదుపు చేస్తున్నారు. దాదాపు 30 వేల మందిపైగా పిల్లలు ఈ బ్యాంక్‌లో తమ డబ్బులు దాచుకుంటున్నారు. ఇలా పిల్లలు పొదుపు చేసిన మొత్తం రూ. 30 కోట్లు పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ బాలగోపాల్ బ్యాంక్ (Bal Gopal Bank) ఇదంతా ఎలా చేయగలిగింది?ఎవరు స్థాపించారు?ఇదార్ పట్టణవాసి అశ్విన్ పటేల్ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ బాలగోపాల్ బ్యాంక్. 16 ఏళ్ల క్రితం ఆయన ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు. రైతులకు, మహిళలకు సహకార సంఘాలు ఉన్నట్టుగా పిల్లలకు ఎందుకు లేవన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానంగా 2009, మే 30న సబర్కాంత జిల్లాలోని జవాన్పురా గ్రామంలో 'బాలగోపాల్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ' స్థాపించారు. 100 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 335 గ్రామాల నుంచి 30 వేలమందిపైగా పిల్లలు సభ్యులుగా ఉన్నారు. దేశంలో పిల్లల కోసం నడుస్తున్న ఏకైక సహకార సంస్థ తమదేనని 58 ఏళ్ల అశ్విన్ పటేల్ వెల్లడించారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని బాలగోపాల్ బ్యాంక్‌గా పిలుస్తున్నారు. ఎలా పని చేస్తుంది?పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు రూ. 110 చెల్లించి బాలగోపాల్ బ్యాంక్‌లో ఖాతా తెరవాలి. వారికి సంస్థ ప్రతినిధులు ఒక పిగ్గీ బ్యాంక్ (డిబ్బి) ఇస్తారు. ఇందులో పొదుపు చేసిన డబ్బును ప్రతినెలా ఇంటికి వచ్చి తల్లిదండ్రులు లేదా పెద్దవారి సమక్షంలో లెక్కిస్తారు. తర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్లి పిల్లల ఖాతాల్లో వేస్తారు. పొదుపు చేసిన డబ్బుకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తారు. పిల్లలు తమకు అవసరమైనప్పడు లోన్లు కూడా తీసుకోవచ్చు. వెయ్యి మందిపైగా రుణాలు తీసుకున్నారని బ్యాంక్ తెలిపింది. బాలగోపాల్ బ్యాంక్ పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. 'మొదట్లో పిల్లలతో పొదుపు ప్రారభింపజేయడానికి స్థానిక పాఠశాలల్లో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఇప్పుడైతే తల్లిదండ్రులే తమ పిల్లలతో కలిసి వచ్చి బ్యాంక్‌లో ఖాతాలు తెరుస్తున్నార'ని అశ్విన్ పటేల్ తెలిపారు. 10 నుంచి 12 పిల్లలు తమ దగ్గర పొదుపు చేసిన డబ్బుతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజులు చెల్లించారని ఆయన వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 ఏళ్లలోపు ఎవరైనా తమ సంస్థలో డబ్బులు దాచుకోవచ్చని చెప్పారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని 'పిల్లల బ్యాంక్'గా పిలుస్తున్నారు.పేరెంట్స్ ప్రశంసలుబాలగోపాల్ బ్యాంక్ సేవలను పేరెంట్స్ ప్రశంసిస్తున్నారు. తమ పిల్లలు చిన్నతనం నుంచే ఆర్థిక అక్షరాస్యత, పొదుపు పాఠాలను ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నారని వారు అంటున్నారు. డబ్బు పొదుపు ప్రాముఖ్యతతో పాటు, సేవ్ చేసిన సొమ్ములను సరైన వాటికి ఖర్చుచేయడం వారికి అలవాటు అవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బుతో పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.చదవండి: పిల్లలూ బ్యాంక్ తలుపు తట్టండి!పైలట్ ప్రాజెక్ట్‌గా.. బాలగోపాల్ బ్యాంక్ విజయవంతంగా నడుస్తుండడంతో దీన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 25 పాఠశాలల్లో 'బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజన’ పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తోంది. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సొంత నియోజకవర్గం ఘట్లోడియాలోని గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజనను తాత్కాలికంగా అమలు చేస్తున్నారు. బాలగోపాల్ బ్యాంక్ గురించి తెలిసిన వారు తమ ప్రాంతంలోనూ ఇలాంటి పిల్లల బ్యాంకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. -
Vidyun Goel: ఈ లైబ్రరీలో పుస్తకాలుండవ్! ఆడుకునే బొమ్మలు మాత్రమే..
టాయ్ బ్యాంక్, ఇది పిల్లలు డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంకు కాదు. పిల్లలు ఆడుకునే బొమ్మల బ్యాంకు. పుస్తకాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పెద్దవాళ్లు లైబ్రరీకి వెళ్లి తమకు నచ్చిన పుస్తకాన్ని చదువుకున్నట్లే ఇది కూడా. అందరూ అన్ని పుస్తకాలనూ కొనుక్కోవడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి లైబ్రరీ అనే ఒక అందమైన ప్రదేశం ఆవిష్కృతమైంది. మరి, బొమ్మలతో ఆడుకునే బాల్యాన్ని హక్కుగా కలిగిన పిల్లల గురించి ఎవరైనా ఆలోచించారా? విద్యున్ గోయెల్ ఆలోచించారు. ఆమె టాయ్ బ్యాంకు పేరుతో ఒక బొమ్మల నిలయానికి రూపకల్పన చేశారు. నాలుగేళ్ల కిందట ఆమె ప్రారంభించిన టాయ్ బ్యాంకు బొమ్మలతో ఇప్పటికి ఐదు లక్షల మంది పిల్లలు ఆడుకున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విద్యున్ గోయెల్ బాల్యం దాటి కాలేజ్ చదువుకు వచ్చిన సమయం అది. పైగా వాళ్ల నాన్నకు ఉద్యోగ రీత్యా బదిలీ కూడా. ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ ఒక చోట జమ చేస్తే ఓ గది నిండేలా ఉంది. వాటన్నింటినీ ఏం చేయాలనే ప్రశ్న అందరిలో. పారేయడానికి మనసు ఒప్పుకోదు. తమతో తీసుకువెళ్లడమూ కుదిరే పని కాదు. అప్పుడు వాళ్ల నాన్న ‘ఈ బొమ్మలన్నింటినీ వెనుక ఉన్న కాలనీలో పిల్లలకు ఇస్తే, వాళ్లు సంతోషంగా ఆడుకుంటారు’ అని సలహా ఇచ్చారు. అంతే... తన బొమ్మలతోపాటు తన స్నేహితుల ఇళ్లలో అటక మీద ఉన్న బొమ్మలను కూడా జత చేసి పంచేసింది విద్యున్ గోయెల్. అలా మొదలైన బొమ్మల పంపకాన్ని ఆమె పెద్దయిన తర్వాత కూడా కొనసాగించింది. టాయ్ బ్యాంకు పేరుతో బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలుంటారు. వాళ్లు పెద్దయిన తర్వాత ఆ బొమ్మలు అటకెక్కుతుంటాయి. అలా తెలిసిన వాళ్లందరి నుంచి సేకరించిన బొమ్మలను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు, అంగన్వాడీ కేంద్రాలకు, షెల్టర్ హోమ్స్‌లో ఉన్న పిల్లలకు, పిల్లల హాస్పిటళ్లు, అల్పాదాయ వర్గాల కాలనీలకు వెళ్లి పంపిణీ చేయడం మొదలు పెట్టింది. ఆమె టాయ్ బ్యాంకు సర్వీస్ ఏ ఒక్క నగరానికో, పట్టణానికో పరిమితం కాలేదు. ఆమె మొదలు పెట్టిన ఈ కాన్సెప్ట్‌ను దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకున్నారు. ఇప్పటి వరకు టాయ్ బ్యాంకు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు ఐదు లక్షలకు చేరి ఉంటుందని అంచనా. మనం కూడా మనవంతుగా టాయ్బ్యాంకు వితరణలో పాల్గొందాం. ఇంట్లో ఉన్న బొమ్మలను మన ఊళ్లోని అంగన్వాడీ కేంద్రానికి విరాళంగా ఇద్దాం. మన పిల్లలకు వాళ్ల జ్ఞాపకంగా ఒకట్రెండు బొమ్మలను ఉంచి మిగిలిన వాటిని బొమ్మలతో ఆడుకునే వయసు పిల్లలకు ఇద్దాం. ఇచ్చేసే బొమ్మలు కూడా ఓ జ్ఞాపకంగా ఉండాలనుకుంటే మన పిల్లల చేతనే ఇప్పిస్తూ చక్కటి ఫొటో తీసుకుంటే... పెద్దయ్యాక ఆ ఫొటోలు చూసుకుని సంతోషిస్తారు. ఆ బొమ్మలతో ఆడుకునే పిల్లలు బొమ్మల లోకంలో ఆనందంగా విహరిస్తారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! -
పిగ్గీ బ్యాంక్ కహానీ..
కిడ్స్ బ్యాంక్ అనగానే చిన్న పంది పిల్ల ఆకారంలో, డబ్బులు దాచుకునే డిబ్బీ లాంటిది కళ్ల ముందు కదలాడుతుంది. పిల్లలకు చిన్నప్పట్నుంచి పొదుపును అలవాటు చేసేందుకు కిడ్స్ బ్యాంక్‌ని.. పిగ్గీస్ బ్యాంక్ అంటూ పంది పిల్ల ఆకారంలో తయారు చేయడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. సుమారు పదిహేనో శతాబ్దంలో వంట పాత్రలు మొదలైన వాటి తయారీకి ఉపయోగించే లోహాల ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. దీంతో, కాస్త చౌకగా ఉండే పిగ్ (పీఐజీజీ) అనే రకం బంక మట్టితో వీటిని తయారు చేసి విక్రయించేవారు. అడపాదడపా గృహిణులు పావలా, అర్ధణా (అంటే అచ్చంగా ఇవే కావు.. ఏ దేశం కరెన్సీని ఆ దేశం వారు) లాంటివి ఈ పిగ్ బంకతో తయారు చేసిన పాత్రల్లో దాచుకునేవారు. వీటినే పిగ్గీ బ్యాంక్ అంటూ పిలుచుకోవడం మొదలుపెట్టారు. కాలక్రమంలో ఈ పిగ్గీ బ్యాంకులు రూపాంతరం చెందాయి. పంథొమ్మిదో శతాబ్దం ప్రాంతంలో పెద్ద ఎత్తున పిగ్గీ బ్యాంకులకు ఆర్డర్లు రావడంతో సార్థక నామధేయంగా పిగ్ (పంది) ఆకారంలో వీటిని తయారు చేయడం మొదలుపెట్టారు. చూడముచ్చటగా తీర్చిదిద్దడంతో ఇవి పెద్దలతో పాటు పిల్లలను కూడా ఆకట్టుకున్నాయి. అలా ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి.