
షెడ్యూల్ విడుదలతో మొదలైన హడావుడి
భవిష్యత్ కార్యాచరణపై నేతలు, కార్యకర్తల దృష్టి
టికెట్ల కోసం ముమ్మర యత్నాలు.. ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రణాళిక
ప్రచారం నిర్వహణకూ ఏర్పాట్లు
నెల రోజుల పాటు కొనసాగనున్న ఎన్నికల ప్రక్రియ... అభ్యర్థుల ఖర్చు తడిసిమోపెడవుతుందనే అంచనాలు
కోడ్ అమలుపై అధికారుల ఫోకస్
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే టికెట్ ప్రయత్నాలు మొదలు పెట్టిన అన్ని పార్టీల నేతలు, మరోవైపు తాము పోటీ చేయాలనుకునే స్థానాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆర్థిక వనరులను, మందీ మార్బలాన్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు. మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
కాగా అక్టోబర్ 9న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలై, నవంబర్ 11న ఫలితాల వెల్లడితో ఈ ప్రక్రియ ముగియనుండడంతో.. దాదాపు నెల రోజులు అభ్యర్థులకు ఖర్చుల మోత మోగిపోతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దసరా, ఆ తర్వాత దీపావళి పండుగల మధ్యలో ఎన్నికలు జరగనుండటంతో గ్రామాల్లో విందు భోజనాలు, మందు పార్టీల జోరుతో ఎన్నికల హడావుడి పతాకస్థాయికి చేరడం ఖాయమని అంటున్నారు.
తొలుత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు
ముందుగా రాజకీయ పార్టీల గుర్తులపై రెండు దశల్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరగనుండడంతో.. ఆయా సీట్లలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయా స్థానాలకు ముందుగానే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆ మేరకు ఓటర్లకు చేరవయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
పోటీకి ఎంపిక చేసుకున్న స్థానాల్లో ప్రజలను కలుసుకోవడం, పలానా స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టుగా వారికి తెలిసేలా ప్రాథమిక ప్రచార నిర్వహణపై దృష్టి పెడుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో ముందుగా రాజకీయ పార్టీల జిల్లా స్థాయి నాయకత్వాలను ఒప్పించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
ఎన్నికలకు ఎంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుందోనని అంచనాలు వేసుకుంటున్నారు. ఎలాగైనా టికెట్ సాధించి రాజకీయంగా ఎదగాలనే తమ కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇలావుండగా సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీని అమలుపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు.
రెండు స్థానాలకూ పోటీ చేయొచ్చు!
ఒక అభ్యర్థి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు రెండింటికీ ఏకకాలంలో పోటీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలను బట్టి తెలుస్టోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకే మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎలాంటి అవకాశం ఉండదు.
జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే వారు ఆ జిల్లాలోని గ్రామీణ ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లా ఓటరుకు జిల్లాలోని ఏ జెడ్పీటీసీ స్థానం నుంచి అయినా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసే వారు సంబంధిత మండలం ఓటరై ఉండాలి. ఆ ఓటరు ఆ మండలంలోని ఏ ఎంపీటీసీ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు (రిజర్వేషన్ స్థానం వర్తింపును బట్టి) అవకాశం ఉంటుంది.
21 ఏళ్లు పూర్తై ఉండాలి
⇒ నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి 21 ఏళ్ల వయసు పూర్తిచేసుకుని ఉండాలి
⇒ ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేయాలంటే.. తెలంగాణకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించిన ఏదేని ఒక కులం, తెగకు (కమ్యూనిటీకి) చెందినవారై ఉండాలి. ఎస్టీలు ఏ వర్గానికి రిజర్వ్ కాని సీటు (జనరల్)కు కూడా పోటీ చేయొచ్చు.
⇒ ఎస్సీలు, బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన ఏదైనా సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ వర్గాల వారు కూడా ఏ విధంగానూ రిజర్వ్ కాని స్థానాలకు పోటీ చేయొచ్చు.
⇒ మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లలో వారే పోటీ చేయాలి. జనరల్ కేటగిరీ సీటుకు కూడా మహిళలు పోటీ పడొచ్చు.
శిక్ష పడితే అనర్హులు
⇒ క్రిమినల్ కోర్టు ద్వారా శిక్ష పడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు అనర్హులు. శిక్ష ముగిసిన తేదీనుంచి ఐదేళ్ల పాటు అనర్హత వర్తిస్తుంది.
⇒ 1955 పౌరహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం శిక్ష పడినవారు కూడా అనర్హులు.
⇒ 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 22, 23, 24 సెక్షన్ల ప్రకారం అనర్హులై ఉండకూడదు.
⇒ మతస్థిమితం లేనివారు, చెవిటి లేదా మూగవారు అనర్హులు
⇒ దివాలా తీసిన లేదా దివాలా నుంచి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించినవారు లేదా అందుకు (ఇన్‌సాల్‌వెన్సీ) దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులు.
⇒ మండల, జిల్లా పరిషత్ లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల ద్వారా చేపట్టిన ఏదైనా పనికి సంబంధించిన కాంట్రాక్ట్ పొందినవారు, అందులో భాగస్వామ్యం ఉన్నవారు అనర్హులు.
⇒ ఏదైనా పారితోషికం పొందుతూ గ్రామ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న వారు అనర్హులు.
⇒ 1973 నేర శిక్షా స్మృతి ప్రకారం మేజిస్ట్రేట్‌గా ఆ గ్రామంలోని ఏదైనా ప్రాంతంపై అధికార పరిధి కలిగి ఉన్నవారు అనర్హులు.
⇒ ప్రస్తుతం లేదా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి బకాయి పడి, ఆ బకాయి చెల్లించాలని బిల్లు/నోటీస్ ద్వారా తెలియజేసినా నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వారు అనర్హులు.
⇒ గ్రామ సహాయకునిగా (వీఆర్‌ఓ)గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగిగా కానీ లేదా స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఏదైనా సంస్థల్లో ఉద్యోగిగా ఉన్నవారు అనర్హులు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత పొందిన ఏదైనా సంస్థలో కార్యవర్గ సభ్యుడిగా ఉండకూడదు.
⇒ అవినీతికి పాల్పడినందుకు కేంద్రం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగింపబడిన వారు తొలగించిన తేదీ నుంచి అయిదేళ్ల వరకు పోటీకి అనర్హులు.
⇒ గతంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పిచనందుకు, సరైన పద్ధతిలో సమర్పించనందుకు ఎన్నికల సంఘం ద్వారా అనర్హులుగా ప్రకటించినవారు పోటీకి అనర్హులు.
బ్యాంకు ఖాతా తెరవాల్సిందే..
ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ఎన్నికల్లో చేసే ఖర్చు వివరాల నిమిత్తం ప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలి. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం ఒకరోజు ముందుగా ఈ ఖాతా తెరిచి ఉండాలి. నామినేషన్ దాఖలు సమయంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఈ బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేయాలి.
ఆ ఖాతానుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చు చేయాలి. అభ్యర్థి తన సొంత నిధులతో పాటు ఎన్నికల కోసం ఇతరుల నుంచి వచ్చే నిధులను కూడా ఈ ఖాతాలోనే జమ చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. తమ రోజువారీ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలు చూపించాలి. అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలను పర్యవేక్షించే బాధ్యతను ఎంపీడీఓలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అప్పగించింది.