
ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఎడారిగా మారనున్న శ్రీశైలం, సాగర్ ఆయకట్టు
ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తువరకు నీటిని నిల్వ చేసే పనులను వేగిరం చేసిన కర్ణాటక
పునరావాసం, భూసేకరణకు రూ.70 వేల కోట్లు మంజూరు
129.72 నుంచి 279.72 టీఎంసీలకు పెరగనున్న డ్యాం నిల్వ సామర్థ్యం
అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటిని అందించేలా కాలువల వ్యవస్థను పూర్తి చేసిన కర్ణాటక
డ్యాంలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా తరలించేందుకు ఏర్పాట్లు
ఫలితంగా వర్షాభావ సంవత్సరాల్లో శ్రీశైలానికి చుక్క నీరూ వచ్చే అవకాశం లేదంటున్న నిపుణులు
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారే.. రాష్ట్రంలో తాగునీటికీ ఇక్కట్లే
ఆల్మట్టిలో నీటి నిల్వ ఎత్తు పెంపు అంశం సుప్రీం ముంగిట
సాక్షి, హైదరాబాద్: ఆల్మట్టి డ్యాం వేదికగా కృష్ణా జలాలపై కర్ణాటకానికి తెరలేచింది. డ్యాం ఎత్తుపెంచి నీటి నిల్వ సామర్థ్యాన్ని 129.72 నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచే పనులను ఆ రాష్ట్రం వేగవంతం చేసింది. దీనివల్ల శ్రీశైలంపై ఆధారపడ్డ కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, అచ్చంపేట తదితర ప్రాజెక్టులతోపాటు నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాగునీటికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచడానికి కర్ణాటక కేబినెట్ సెప్టెంబర్ 17న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంపునకు గురయ్యే 20 గ్రామాలు, బాగల్‌కోట మునిసిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పించడానికి ఆమోదం తెలిపింది. దీనికోసం 75,663 ఎకరాల భూమిని సేకరించడానికి రూ.70 వేల కోట్లను మంజూరు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
మాగాణి భూములకు ఎకరానికి రూ.40 లక్షలు, మెట్ట భూమి ఎకరానికి రూ.30 లక్షల పరిహారం ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. తద్వారా డ్యాం నిల్వ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 129.72 నుంచి 279.72 టీఎంసీలకు పెంచనుంది. అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటిని అందించడానికి వీలుగా కాలువల వ్యవస్థను ఇప్పటికే పూర్తి చేసింది. తద్వారా డ్యాంలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఆయకట్టుకు తరలించడానికి కర్ణాటక సర్కార్ ప్రణాళికలు రచించింది.
మనకు తాగునీటికీ ఇబ్బందులే...
కర్ణాటక సర్కారు చర్యతో వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమయ్యే సంవత్సరాల్లో ఆల్మట్టి, నారాయణ పూర్ డ్యాంలను దాటి కృష్ణా నది నుంచి ఒక్క నీటి చుక్క కూడా శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉండదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015–16లో శ్రీశైలానికి కనిష్టంగా 58.69 టీఎంసీల ప్రవాహం.. అందులో కృష్ణా నుంచి వచ్చింది కేవలం 24.97 టీఎంసీలేనని ఉదహరిస్తున్నారు.
ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారడ్డ కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, అచ్చంపేట తదితర ప్రాజెక్టులతోపాటు నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఆయకట్టు ఎడారిగా మారుతుందని చెబుతున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రంలో సంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని.. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ) దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే చెప్పారు.
నాడు నోరు మెదపని చంద్రబాబు
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కింద 173 టీఎంసీలను కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. దాంతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ డ్యాం, హిప్పర్గి వియర్) పనులను 1964లో కర్ణాటక సర్కార్ చేపట్టింది. అప్పట్లో ఆల్మట్టి డ్యాంను 509.016 మీటర్ల ఎత్తుతో చేపట్టగా, తర్వాత 524.256 మీటర్లకు పెంచుతూ 1995లో నాటి దేవెగౌడ సర్కార్ పనులు ప్రారంభించినా అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నోరుమెదపలేదని సాగునీటిరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
1996, సెప్టెంబరు 1న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దేవెగౌడ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి అవసరమైన నిధులను రుణంగా మంజూరు చేసేలా చక్రం తిప్పారు. దాంతో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే పనులు వేగవంతమయ్యాయి. దీంతో తమ రాష్ట్రంలోని ప్రాంతాలు ముంపునకు గురవుతాయంటూ అప్పట్లో మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ఆయకట్టుకు నీళ్లందవంటూ ఉమ్మడి ఏపీ రైతులు రోడ్డెక్కారు.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసి వాదన వినిపించాయి. దీంతో డ్యాంలో నీటిని నిల్వ చేసే ఎత్తును 519.06 మీటర్లకు పరిమితం చేయాలంటూ 2000, ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు గడువు 2000, మే 31తో ముగియనున్న నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం ఏర్పాటుచేసే కొత్త ట్రిబ్యునల్ వద్ద డ్యాం ఎత్తు పెంపుపై వాదనలు వినిపించుకోవాలని కర్ణాటకకు సూచించింది.
ఇప్పటికే 524.256 మీటర్లకి ఎత్తు పెంపు
కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి 2004, ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసింది. డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పనులను 2002 నాటికే కర్ణాటక సర్కార్ పూర్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2002–03లో 519.06 మీటర్ల ఎత్తుతో 129.72 టీఎంసీలను నిల్వ చేసింది. డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నిల్వ చేసేలా పనులు పూర్తి చేశామని.. నీటి కేటాయింపులు చేయకపోతే.. ఆ పనులకు చేసిన వ్యయం వృథా అవుతుందని ట్రిబ్యునల్ ఎదుట కర్ణాటక వాదించింది.
ఈ వాదనతో ఏకీభవించిన బ్రిజేష్ ట్రిబ్యునల్.. అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యతగా కేటాయించిన 173 టీఎంసీల జోలికి వెళ్లకుండా 65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా 130 టీఎంసీలను కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ 2013, నవంబర్ 29న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఎస్పెల్పీలు దాఖలు చేశాయి.
దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదిక అమలును నిలుపుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టును ఆదేశించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ చేస్తుండటంతో ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఈ కేసులో ప్రతివాదిగా చేరింది. దీనిపై బలంగా వాదనలు వినిపించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి సైతం ఇటీవల అధికారులను ఆదేశించారు. మరోవైపు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం.