పర్యాటకానికి కొత్త కళ తెచ్చేందుకు సర్కారు కసరత్తు
హైదరాబాద్–సోమశిల–శ్రీశైలం సర్క్యూట్‌లో హెలి టూరిజం
నాగార్జునసాగర్, బస్వాపూర్, సోమశిల.. వెడ్డింగ్ డెస్టినేషన్స్
రానున్న రోజుల్లో రూ.22,324 కోట్ల పెట్టుబడులు.. 90 వేల ఉద్యోగాల సృష్టి
సాక్షి, హైదరాబాద్: పర్యాటకానికి కొత్త కళ తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. పర్యాటక రంగానికి కీలకంగా హెలి టూరిజం, మెడికల్, హెరిటేజ్ పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రంగాల్లో పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడమేకాక.. వెడ్డింగ్ డెస్టినేషన్ టూరిజాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితోపాటు, పర్యాటకులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించేందుకు టూరిజం పోలీసింగ్‌ను పెంచాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రూ. 22,324 కోట్ల వ్యయంతో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయని, తద్వారా సుమారు 90 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు పర్యాటక శాఖ వెల్లడించింది. ఎకో (పర్యావరణ), మెడికల్ (వైద్య), హెరిటేజ్ (వారసత్వ), స్పిరిచువల్ (ఆధ్యాత్మిక), రూరల్ అండ్ ట్రైబల్ (గ్రామీణ, గిరిజన), సినిమా, వెడ్డింగ్ డెస్టినేషన్, స్పోర్ట్స్ టూరిజంపై దృష్టి సారించి ‘తెలంగాణ టూరిజం పాలసీ 2025–30’ని అమలులోకి తెచ్చామని, దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనుంది.
స్పష్టమైన ప్రణాళికతో..
రానున్న సంవత్సరంలో పర్యాటకాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు ఆ శాఖ వెల్లడించింది. అందులో ప్రధానంగా ❇️హైదరాబాద్ – సోమశిల – శ్రీశైలం సర్క్యూట్‌లో హెలి టూరిజం సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం, ❇️నాగార్జున సాగర్, సోమశిల, బస్వాపూర్ రిజర్వాయర్ వంటి ప్రాంతాలను అత్యుత్తమ వెడ్డింగ్ డెస్టినేషన్లుగా అభివృద్ధి చేయనుంది.
అలాగే, ❇️మెడికల్ టూరిజం సొసైటీని స్థాపించి, హైదరాబాద్‌ను గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనుంది. ❇️జనవరి 13, 14, 15న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ షోలో 19 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ భాగస్వాములు కానున్నట్లు ఆ శాఖ తెలిపింది. గచి్చ»ౌలి స్టేడియంలో జనవరి 13, 14న హైటెక్ డ్రోన్లతో వినూత్న ప్రదర్శన నిర్వహించనుంది.
భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు
టూరిజం కాంక్లేవ్ 2025 ద్వారా 30 ప్రాజెక్టులకు రూ. 15,279 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, తద్వారా సుమారు 50,000 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పర్యాటక శాఖ చెప్పింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరో రూ.7,045 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపింది, పెట్టుబడుల్లో ప్రదానంగా ఫుడ్‌లింక్ గ్లోబల్ సెంటర్ (రూ.3,000 కోట్లు), సారస్ ఇన్‌ఫ్రా (రూ.1,000 కోట్లు), స్మార్ట్ మొబిలిటీ (రూ.1,000 కోట్లు) వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయని వివరించింది, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 123 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 78 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి.
అనంతగిరి కొండల్లో ’ఎకో–టూరిజం జోన్స్’, భువనగిరి కోట వద్ద ’ఎక్స్‌పీరియెన్షియల్ జోన్’ను తీర్చిదిద్దుతున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం యూనిఫైడ్ ఆన్‌లైన్ పోర్టల్, డిజిటల్ ట్రావెల్ కార్డులు వంటి వినూత్న సేవలకు శ్రీకారం చుట్టినట్లు పర్యాటక శాఖ పేర్కొంది.


