3 నెలలపాటు గడువు పెంచిన సర్కార్
ఇప్పటికీ రిజి్రస్టేషన్ చేసుకోని 40శాతం మంది విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31తో దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ ఇంకా 40 శాతం మంది విద్యార్థులు దర ఖాస్తులు చేసుకోకపోవడం... మరోవైపు కొన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో గడువు పొడిగింపు అనివార్యమైంది.
దీంతో ఏకంగా 3 నెలలపాటు గడువు పొడిగిస్తూ మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాశ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గడువు పొడిగింపును విస్తృతంగా ప్రచారం చేయాలని సంక్షేమ శాఖల అధికారులు, కాలేజీ యాజమాన్యాలను ఆదేశించారు.
కాలేజీల చొరవే కీలకం: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల దరఖాస్తులో కాలేజీ యాజమాన్యాలే చొరవ తీసుకోవాలని సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు సగటున 12.65 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
2025–26 విద్యా సంవత్సరంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెపె్టంబర్‌లో ప్రారంభమైంది. 4 నెలల పాటు అవకాశం కల్పించినప్పటికీ 7.85 లక్షల మంది మాత్రమే ఈపాస్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరోవైపు పీజీఈసెట్–2025, లాసెట్–2025 తదితర 4 సెట్‌లకు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈనెలాఖరు వరకు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.


