
సాక్షి, హైదరాబాద్: ఎంజీబీఎస్ నుంచి తిరిగి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. యథావిధిగా ప్రతీరోజు నడిచే బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకకు బస్సు సర్వీసులు నడుస్తాయని స్పష్టం చేశారు. సూపర్ లగ్జరీ, డీలక్స్, స్పెషల్ బస్సులతో సహా సుమారు 2500 సర్వీసులు తిరిగి రాకపోకలు కొనసాగించనున్నాయి.
ఇక, మూసీ నదికి వరద ఉద్ధృతి తగ్గింది. దీంతో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. శనివారం కురిసిన వర్షానికి ఎంజీబీఎస్‌లో పేరుకుపోయిన బురదను ఈ ఉదయం నుంచి సిబ్బంది తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వరద కారణంగా శనివారం ఊర్లకు వెళ్లాలి అనుకున్న ప్రయాణికులు ఇప్పుడు బయలు దేరుతున్నారు. ప్రస్తుతం బస్టాండ్ ప్రయాణికులతో కళకళలాడుతుంది.
పలు ప్రాంతాల నుంచి జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు పికప్ పాయింట్ల వద్దకు వెళ్లాలని ఆర్టీసీ సిబ్బంది సూచిస్తున్నారు. ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, జేబీఎస్ నుంచి జిల్లాలకు బస్సులు నడుస్తున్నాయి. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు పికప్ పాయింట్ల వద్దకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారు.
