నగరంలోని ప్రతి ప్రాంతంలోనూ బిచ్చగాళ్లు
గతంలో బెగ్గర్ ఫ్రీ సిటీ కోసం అనేక ప్రయత్నాలు
షెల్టర్ హోమ్స్ నిర్వహించి తరలించిన అధికారులు
ఆపై వదిలేసిన పోలీసు, బల్దియా యంత్రాంగాలు
‘కొత్తవారు’ వచ్చినప్పుడు పాత విధానాలు మూలకు
రాజధానిలోని ఓ ట్రాఫిక్ కూడలి... రెడ్ సిగ్నల్ పడింది... వాహనాలు ఆగడంతోనే బిచ్చగాళ్లు వచ్చారు... బాబ్బాబ్బాబు అంటూ వాహనచోదకుల్ని చుట్టుముట్టారు... నగరంలోని ఏ జంక్షన్ చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. ఈ పరిస్థితుల్ని మార్చడానికి గతంలో పని చేసిన పోలీసు, బల్దియా అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేయడం, బిచ్చగాళ్లను వాటిలోకి తరలించడం చేశారు. ఇప్పుడా చర్యల్ని అంతా మర్చిపోవడంతో మళ్లీ రోడ్లన్నీ బిచ్చగాళ్లతో నిండిపోతున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో
అధికారులు మారినప్పుడల్లా పాత విధానాలు అటకెక్కుతున్నాయి. గ్లోబల్ సిటీ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వం ఈ బిచ్చగాళ్ల అంశం పైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. హిజ్రాల వ్యవహారాలపై ఎట్టకేలకు స్పందించిన కొత్వాల్ సజ్జనర్ వారి కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే పంథాలో బిచ్చగాళ్ల విషయంలోనూ జీహెచ్‌ఎంసీతో కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇవాంక పర్యటనతో తొలి అడుగు...
నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో బిచ్చమెత్తుకోవడాన్ని నిషేధిస్తూ నగర పోలీసులు 2017లో తొలిసారిగా నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏడాది నవంబర్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ సిటీలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆ నెల ఏడున సిటీ కొత్వాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అనేక మంది బిచ్చగాళ్లు అభ్యంతరకరంగా బిచ్చమెత్తుకుంటున్నట్లు ప్రజల ద్వారా తమ దృష్టికి వచ్చిందని పోలీసులు ప్రకటించారు. రహదారుల్లోని ప్రధాన జంక్షన్లలో బిచ్చమెత్తుకోవడానికి కొందరు చిన్న పిల్లలు, దివ్యాంగుల్ని సైతం నియమించుకుంటున్నట్లు తెలిసిందంటూ.. ఆ పంథాలో పాదచారులు, వాహనచోదకుల నుంచి బిచ్చం తీసుకోవడానికి బిచ్చగాళ్లు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారనీ పేర్కొన్నారు.
వెతికిపట్టుకుని షెల్టర్‌కు తరలింపు...
ఈ ఉత్తర్వుల నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఆపరేషన్ ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ని పోలీసులు ప్రారంభించారు. ఎక్కడిక్కడ బిచ్చగాళ్ల కోసం గాలించడం, చిక్కిన వారిని ఆనందాశ్రమాలకు తరలించడం చేశారు. రహదారులు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు, ప్రార్థన స్థలాలు, పార్కులతో పాటు ఇతర చోట్ల శాంతిభద్రతల విభాగం అధికారులు డ్రైవ్ చేపట్టారు. ఆయా చోట్ల చిక్కిన బిచ్చగాళ్లకు పోలీసులు తొలుత కౌన్సిలింగ్ ఇచ్చి వారి నుంచి ప్రతిఘటన ఎదురుకాకుండా చూసుకున్నారు. ఆపై వారిని చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లల్లో ఏర్పాటు చేసిన ఆనందాశ్రమాలకు తీసుకువెళ్లారు. పురుషుల్ని చంచల్‌గూడ, మహిళల్ని చర్లపల్లిల్లో ఉంచి ఆహారం, వస్త్రాలు, వైద్యం తదితర సౌకర్యాలు కలి్పంచడంతో పాటు దివ్యాంగులు కాని బిచ్చగాళ్లకు సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పించారు.
జైళ్ళ శాఖ ఆధీనంలోని కార్మాగారాల్లో పని చేయడానికి ఆసక్తి చూపిన వారికి ఎనిమిది గంటలకు రూ.400 చొప్పున చెల్లించారు. ఎవరైనా బిచ్చగాళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని ఆశించినా, వారికోసం సంబం«దీకులు వచ్చినా వారితో బాండ్ రాయించుకుని పంపించారు. ఈ బెగ్గర్ ఫ్రీ ఆపరేషన్లు అప్పట్లోనే కాదు.. ఆ తర్వాత కొన్నాళ్లు జరిగాయి. జీహెచ్‌ఎంసీ షెల్టర్ హోమ్స్ నిర్వహించి పోలీసులతో కలిసి పని చేసింది. కాలక్రమంలో అంతా అన్నీ మర్చిపోవడంతో మళ్లీ రహదారులపై బెగ్గింగ్ సాధారణమైంది.
ఆయా చట్టాల కింద చర్యలంటూ...
బిచ్చగాళ్లు చర్యలు వాహనచోదకులకు విసుగు పుట్టించేవిగా, కోపం తెప్పించేవిగా, ట్రాఫిక్ సజావుగా సాగడానికి ఇబ్బందికరంగా, అభ్యంతరకరంగా ఉంటున్నాయని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. ఇవి సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని, ప్రజల భద్రతకు ముప్పుగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, జంక్షన్లలో బిచ్చమెత్తుకోవడా నిషేధిస్తున్నట్లు నాటి కొత్వాల్ ప్రకటించారు.
దీన్ని ఉల్లంఘించిన వారిపై ఐపీసీలోని 188 సెక్షన్‌తో పాటు హైదరాబాద్ పోలీసు చట్టం, తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్, జ్యువైనల్ జస్టిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం ఓ ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే గరిష్టంగా నెల రోజుల జైలు లేదా రూ.200 జరిమానా లేదా రెండూ విధించే ఆస్కారం ఉందని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులు ఆ మర్నాటి నుంచే అమలులోకి వచ్చాయి.


