రాజధానిలోని పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్‌లోకి శంషాబాద్.. లష్కర్‌లోకి నార్త్‌జోన్
ఫ్యూచర్ సిటీ కోసం కొత్తది ఏర్పాటు... నాలుగుకు పెరగనున్న కమిషనరేట్లు
సీఎం ఆదేశాలతో కీలక నిర్ణయం తీసుకున్న డీజీపీ
బల్దియా ఎన్నికల్లోపు అమలులోకి తెచ్చేలా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: బృహత్ నగరంగా విస్తరించిన జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అదే సమయంలో రాజధానిలోని పోలీసు కమిషనరేట్లనూ పునర్వ్యవస్థీకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్న జోనల్ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసు విభాగం ఈ మేరకు కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రాథమిక కసరత్తు చేసిన అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శనివారం డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో మార్పుచేర్పులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఆదివారం నిర్వహించిన సమావేశానికి పురపాలక, పోలీసు శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాచ కొండ పేరును లష్కర్ కమిషనరేట్‌గా మారుస్తున్న పోలీసు విభాగం ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేస్తోంది. బల్దియా ఎన్నికల్లోపే నాలుగు కమిషనరేట్లను అమ లులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ప్రత్యేక జిల్లాగా యాదాద్రి జోన్
ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, మహేశ్వరంతోపాటు యాదాద్రి జోన్లు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న నార్త్‌జోన్‌ను రాచకొండలో కలుపుతున్నారు. అలాగే రాచకొండలో భాగమైన యాదాద్రి జోన్‌ను ప్రత్యేక జిల్లాగా మారుస్తున్నారు. 19 పోలీసుస్టేషన్లతో ఉండే దీనికి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. నార్త్‌జోన్‌తో కలిసి కొత్తగా మారుతున్న రాచకొండ కమిషరేట్ పేరును లష్కర్ కమిషనరేట్‌గా మారుస్తున్నారు. లష్కర్ బోనాలకు సికింద్రాబాద్ ప్రాంతం నిలయం కావడం... ఈ ఏరియా నార్త్‌జోన్‌లోనే ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్న పటాన్‌చెరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను, మొయినాబాద్‌ను సైబరాబాద్ కమిషనరేట్‌లోకి చేరుస్తున్నారు.
హైదరాబాద్‌లోకి ఆ మూడు ప్రాంతాలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్‌లో కలుపుతున్నారు. ఇప్పుడు శంషాబాద్ జోన్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్లను హైదరాబాద్ కమిషనరేట్‌లోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రస్తుతం ఏడు జోన్లు ఉండగా... సైబరాబాద్‌లో ఐదు, రాచకొండలో నాలుగు జోన్లు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ మూడు కమిషనరేట్లలోనూ కలిపి 12 జోన్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఆరు, సైబరాబాద్, రాచకొండలో మూడు చొప్పున జోన్లు ఉండనున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లోని జోన్లను పునర్వ్యవస్థీకరిస్తూ చారి్మనార్, గోల్కొండ తదితరాలను మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్
సైబరాబాద్‌లో ఉండే కూకట్‌పల్లి జోన్‌లోకి మాదాపూర్ ప్రాంతాన్ని తీసుకొస్తూ కొత్తగా కుత్బుల్లాపూర్ ప్రత్యేక జోన్‌కు రూపమిచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఉన్న మహేశ్వరం జోన్‌తోపాటు షాద్‌నగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల తదితరాలు ఉండనున్నాయి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లోనూ మూడు నుంచి నాలుగు జోన్లు ఉంటాయని తెలుస్తోంది. ముగ్గురు పోలీసు కమిషనర్లతో సమావేశమైన శివధర్‌రెడ్డి కొన్ని కీలక మార్పులు సూచించారు. ఇవి పూర్తయిన తర్వాత ప్రతిపాదనల్ని సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లనున్నారు. ఆయన ఆమోదంతో పునర్వ్యవస్థీకరణకు తుది రూపు రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఏడీజీ) స్థాయి అధికారి, సైబరాబాద్, రాచకొండకు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) స్థాయి అధికారులు కమిషనర్లుగా ఉంటున్నారు. దీన్నే కొనసాగిస్తూ ఫ్యూచర్ సిటీకి ఐజీ స్థాయి అధికారినే నియమించాలని భావిస్తున్నారు.


