ఆర్టీ‘షీ’ డ్రైవర్‌! | TGSRTC First Women Bus Driver Saritha Naik | Sakshi
Sakshi News home page

ఆర్టీ‘షీ’ డ్రైవర్‌!

Jun 18 2025 12:12 AM | Updated on Jun 19 2025 1:35 PM

TGSRTC First Women Bus Driver Saritha Naik

ఆటో డ్రైవర్‌గా తండా గతుకుల రోడ్డు మీద ప్రయాణం ప్రారంభించిన సరిత నాయక్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఆ సవాళ్లకు భయపడి ఉంటే... తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా ప్రత్యేకత సాధించేది కాదు.

సంస్థాన్  నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరిత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో కుటుంబ బాధ్యతలు భుజాలకెత్తుకుంది. అక్క భర్త దేవరకొండలో ఆటోడ్రైవర్‌. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ఆటో నడపడం నేర్చుకుంది సరిత. బావకు విశ్రాంతి ఇచ్చి తానే ఆటో నడిపేది. తోటి డ్రైవర్‌లు రకరకాల ఇబ్బందులు పెట్టేవాళ్లు. ఆటోకు పంక్చర్లు చేయ్యడం, బ్రేక్‌డౌన్  చేసి ఇబ్బందులకు గురి చేసేవారు.

అన్ని ఇబ్బందులు తట్టుకుంటూ మూడు సంవత్సరాల పాటు అక్కడే ఆటో నడిపింది. ఆ తరువాత ఆసుపత్రిలో నర్సుగా పని చేయడానికి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్ళింది. హోలి మేరీ నర్సింగ్‌ కాలేజిలో చేరడానికి ప్రయత్నం చేసినప్పటికి ఫీజు కట్టే స్థోమత లేక అదే కాలేజిలో వార్డెన్‌ ఉద్యోగంలో చేరింది. వార్డెన్ గా పనిచేస్తునే హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌లో బస్సు డ్రైవింగ్‌ నేర్చుకుంది. అదే కాలేజీలోనే బస్‌ డ్రైవర్‌గా పనిచేసింది.

తండా టు దిల్లీ
హెవీ వెహికిల్‌ నడపడంలో సరిత నైపుణ్యం ఆజాద్‌ ఫౌండేషన్  ప్రతినిధి భానుశ్రీ దృష్టికి వచ్చింది. ఆమె సరితకు తమ సంస్థలో పనిచేసే అవకాశం ఇచ్చింది. ‘సఖీ క్యాబ్స్‌’ పేరుతో వంద మంది మహిళా డ్రైవర్‌లతో క్యాబ్స్‌ నడుపుతోంది ఆజాద్‌ ఫౌండేషన్‌. దిల్లీలో క్యాబ్‌ డ్రైవర్‌గా కొత్త జీవితం ప్రారంభించిన సరిత, ఫౌండేషన్  ఇచ్చిన శిక్షణతో హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషలలో కమ్యూనికేషన్  స్కిల్స్‌ నేర్చుకుంది. 

దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ లో మహిళా డ్రైవర్‌ ఉద్యోగం కోసం నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేసుకుంది. అన్ని పరీక్షలలో నెగ్గి ఆ ఉద్యోగానికి ఎంపిక అయింది.
తెలంగాణ ఆర్టీసీ గతంలో మహిళ డ్రైవర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన్నప్పటికీ ఎవరూ దరఖాస్తు చేయ్యలేదు. సరిత ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌గా చేరడంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళ డ్రైవర్‌గా ప్రత్యేకత సాధించింది. – తడకమళ్ళ శ్రీధర్, సాక్షి, సంస్థాన్  నారాయణపురం

అమ్మా,నాన్నల కోసం...
దిల్లీలో ఉద్యోగం వదిలిపెట్టి అమ్మ,నాన్నల కోసం హైదరాబాద్‌కు వచ్చాను. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా గుర్తింపు లభించినందుకు గర్వంగా ఉంది. నేను ప్రయాణించిన దారిలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
– సరిత నాయక్‌ 

Advertisement
 
Advertisement
Advertisement